Joint Family : ఒకే ఇంట్లో 38..కరోనా దరి చేరనివ్వని ఉమ్మడి కుటుంబం

Joint Family : ఒకే ఇంట్లో 38..కరోనా దరి చేరనివ్వని ఉమ్మడి కుటుంబం

Joint Family In Up

Joint Family in UP : కలిసి ఉంటే కలదు సుఖం అనే సందేశంతో ఎన్నో నీతికథలు విన్నాం. నిజమే వాస్తవాల్లోంచి వచ్చినవే నీతి కథల సారాంశం. భౌతిక దూరం పాటించండీ అనే కొత్త నినాదం వచ్చిన ఈ కరోనా కాలంలో కూడా అదే నీతి కనిపిస్తోంది ఓ కుటుంబంలో. ఒకేచోట జనాలు గుంపులుగా గుమిగూడితే కరోనా వ్యాప్తి సులభం అయిపోతున్న ఈరోజుల్లో ఒకే ఇంటిలో 10మంది కాదు 20మంది కూడా కాదు ఏకంగా 38మంది ఉన్నా వారి ఇంట్లోకి కరోనా కనీసం తొంగి కూడా చూడలేకపోయింది. ఉమ్మడి కుటుంబంలో కరోనా కాలు కూడా పెట్టలేకపోయింది. అదే ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ సమీపంలో ఉండే ఓ ఉమ్మడి కుటుంబం. ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబం అనేమాట మర్చిపోతున్న పరిస్థిల్లో ఒకే ఇంటిలో 38మంది కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉంటున్నారు. అయినా వారిలో ఏ ఒక్కరికీ కరోనా సోకనేలేదు.

ఫిరోజాబాద్ జిల్లాలోని తుండ్లా తహసీల్ గ్రామం చికావు. ఈ గ్రామంలో 38 మంది సభ్యులతో ఉన్న దీక్షిత్ కుటుంబం నివసిస్తోంది. ఆ గ్రామ పెద్ద బ్రహ్మదత్త దీక్షిత్‌. బ్రహ్మదత్త ను ఎన్నికల విషయంలో వచ్చిన రాజకీయ శత్రుత్వంతో కాల్చి చంపెశారు. ఆయన తరువాత ఆయన నాలుగో కొడుకు వినోద్ దీక్షిత్ ఊరికి పెద్దగా నిలిచాడు. ఊరితో పాటు ఇంటికి కూడా పెద్ద ఆయనే.

తన సోదరులందరితో కలిసి.. ఉమ్మడిగానే కలిసి జీవిస్తున్నారు. 2,674 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిలో వినోద్ దీక్షిత్ భార్యతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం 38 మంది కలిసి ఉంటున్నారు. ఈ కరోనా కాలంలో ఒకే ఇంటిలో ఇంతమంది ఉంటే ప్రమాదమే. అయినా వారి ఇంటిలోకి కరోనా రావటానికి ధైర్యం చేయానేలేదు. ఆ ఇంటి గడపలోకి ఇప్పటివరకూ కరోనా జాడే లేదు.

ఎందుకో ఇంటిపెద్ద వినోద్ దీక్షిత్ మాటల్లోనే..కరోనా కాలంలో మేం అన్ని రకాల కోవిడ్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నాం. ఇంటి లోపల, బయటి నుండి వచ్చే వారైనా సరే డైరెక్ట్ గా లోపలికి రావటానికి ఉండదు. బయటి గదిలో కొంత సమయం గడిపిన తర్వాత..వేడినీళ్ళతో స్నానం చేసి..మాస్క్ పెట్టుకుని ఇంటిలో రావాలి. మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడం పూర్తిగా మానేసారు. బయటకు పనులమీద వెళ్లిన మగవాళ్లు వెళ్ళివచ్చిన తరువాత వారి మాస్క్ లు బట్టలు వేడి నీటిలో వాష్ చేయాల్సిందే. ఇంటిని డైలీ శానిటైజ్ చేస్తారు.

ఇంటిలో అందరూ ఇమ్యూనిగా ఉండటానికి చక్కటి ఆహారం తీసుకుంటారు. ప్రతీ రోజూ..5 కిలోల పిండి, 3 కిలోల బియ్యం, 2 కిలోల పప్పులు, 3 కిలోల దోసకాయ, టొమాటో సలాడ్ తయారు చేసి తింటారు. ఈ ఇంటిలో 9 మంది మహిళలున్నారు. ముగ్గురు చక్కటి ఆహారం తయారు చేయటంలో స్పెషలిస్టులనే చెప్పారు. ఆహరం తయారు చేయటం అందరికీ అందేలా చేయటం ఎవరు తిన్నారు? ఎవరెవరికి ఏమేమి పెట్టాలి అనే పనులు చూసుకుంటారు.

మరో ముగ్గురు ఇంటిలో ఉండే పాడిని చూసుకుంటారు. పాలు కాయటం..పెరుగు ఇటువంటిపనులు చూసుకుంటారు. మిగిలిన ముగ్గురు మహిళలు ఇంటికి సంబంధించిన బట్టలు ఉతకడం..ఇంటి పరిశుభ్రత పనులు చూస్తారు. ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యతలు సక్రమంగా ఎవరికీ వారు చేసుకుంటారు. అది వాళ్లు చేయలేదు. ఇది వీళ్లు చేయలేదు అనే మాటే ఉండదు. ఈ పని నేను చేయటమేంటీ అనే తర్కమే ఉండదు. అలకలు..ఆగ్రహాలు అనేవే ఉండవు. ఉదయం మేల్కొన్నప్పనుంచి ఎవరి పనులు వాళ్లు చాలా క్రమశిక్షణతో చేసుకుపోతుంటారు.

కుటుంబం పెద్దది కావడంతో ఆహారం ఖర్చుకూడా అలాగే ఉంటుంది. ఒక రోజులో వారికి 5 కిలోల పిండి, 3 కిలోల బియ్యం, 2 కిలోల పప్పు, 3 కిలోల సలాడ్ అవసరం అవుతాయని నీరజ్ దీక్షిత్ తెలిపారు. నీరజ్ దీక్షిత్ వ్యవసాయం చేస్తారు. దాంతో పాటు చిన్న వ్యాపారం చేస్తారు. తన పెద్ద సోదరులు ప్రమోద్ దీక్షిత్, మనోజ్ దీక్షిత్, పవన్ దీక్షిత్ ఢిల్లీలో ఉద్యగం చేస్తూంటారని తెలిపారు. కరోనా ప్రారంభమైనప్పటి నుండి వారు కూడా తమ ఇంటికి వచ్చేసారు. అప్పటి నుండి అందరూ గ్రామంలోనే ఉంటున్నామని..వ్యవసాయంతో పాటు, బంగాళాదుంప అమ్మకాలు వంటి చిన్న చిన్న వ్యాపారం చేస్తామని తెలిపారు.

నా ఆదాయం ఎక్కువ వాడి ఆదాయం తక్కువ అనే మాటే లేదని.. అందరూ కలిసే ఉంటామని చెబుతున్నారు నీరజ్ దీక్షిత్. వంట ఇంటిల్లిపాదికీ ఒకే పోయ్యిమీదే జరుగుతుందని నీరజ్ చెప్పారు.ఈ కరోనా కాలంలో కూడా మాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసి మెలిసి ఉంటున్నామని తెలిపారు.