తండ్రి చనిపోయినట్లు కల : 30 ఏళ్లకు ముగ్గురు పిల్లల తండ్రిగా కన్నవారిని కలుసుకున్న కొడుకు

ఇంటిలో గొడవపడి కోపంతో బైటకెళ్లిన కొడుకు వస్తాడని మూడు దశాబ్దాలుగా ఎదురు చూసిన ముసలి తల్లిదండ్రుల కల నెరవేరింది. 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకును కలుసుకున్న తల్లిదండ్రులు..

తండ్రి చనిపోయినట్లు కల : 30 ఏళ్లకు ముగ్గురు పిల్లల తండ్రిగా కన్నవారిని కలుసుకున్న కొడుకు

Son Back Home After 30 Years

son back home after 30 years : ఇంటిలో గొడవపడి కోపంతో బైటకెళ్లిన కొడుకు వస్తాడని మూడు దశాబ్దాలుగా ఎదురు చూసిన ముసలి తల్లిదండ్రుల కల నెరవేరింది. 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసారు. తమ కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన కన్నవారి కల నిజమైంది. ఉత్తరప్రదేశ్‌లోని జైన్‌పూర్‌ పరిధిలోగల పట్టీనరేంద్రపూర్ గ్రామంలో 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన కొడుకును అక్కున చేర్చుకున్న తల్లిదండ్రుల కథ సుఖాంతమైంది.

అది 1991, నవంబరు 11. పట్టీనరేంద్రపూర్ గ్రామానికి చెందిన మోహన్ ప్రసాద్ తివారి కుమారుడు కృష్ణాచంద్ తివారికి 16ఏళ్లు. మోహన్… రేడియోలు, టేప్ రికార్డర్లు రిపేర్ చేసేవాడు.ఇంటిలో చిన్నగొడవ జరిగింది. ఉడుకు రక్తం కదా? కృష్ణాచంద్ తివారికి కోపమొచ్చింది. అంతే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కోపంతో వెళ్లాడు. కోపం తగ్గాక తిరిగి వచ్చేస్తాడులే అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ సాయంత్రం అయినా రాలేదు. కంగారుపడ్డారు. అన్నిచోట్లా వెతికారు. తెలిసినవారినందరిని అడిగారు. స్నేహితుల్ని అడిగారు. కానీ కొడుకు జాడ దొరకలేదు. అలా రోజులు. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుకు గురించి మోహన్ ప్రసాత్ తివారీ వెదుకుతూనే ఉన్నాడు. ఉన్న ఒక్కగానొక్క ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మోహన్ ప్రసాద్ దంపతులు కుమిలిపోయారు. కృంగిపోయారు.

కానీ కొడుకు దొరుకుతాడనే ఆశతో వాళ్లు వెతుకుతూనే ఉన్నారు. కానీ ఫలితం లేదు. కొడుకులేకుండా అలా జీవిస్తునే ఉన్నారు. అలా వాళ్లు వృద్ధాప్యంలోకి వచ్చేశారు. కానీ కొడుకుమీద ఆశ చావలేదు. కొడుకు కోసం ఎదురు చూడటం మానలేదు. పండుగ వచ్చినా..కొడుకే కళ్లల్లో మెదిలేవాడు.

మరోవైపు ఇంటి నుంచి వెళ్లిపోయిన కృష్ణాచంద్ తివారి ఢిల్లీ చేరుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటూ, జీవిస్తున్నాడు. కానీ ఇంటికి వెళ్లాలని అనిపించలేదు. అలా పెరిగి పెద్దవాడయ్యాడు. సొంత ఇల్లు కట్టుకున్నాడు. పెళ్లికూడా చేసుకున్నాడు. పనులు మాని వ్యాపారం ప్రారంభించి బాగానే స్థిరపడ్డాడు. ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు.

అలా సంవత్సరాలు గడిచిపోతున్న క్రమంలో కృష్ణాచంద్ తివారికి ఒకరోజు రాత్రి అతనికి తండ్రి చనిపోయినట్లు కల వచ్చింది. బాదపడ్డాడు. అదేమాట తన స్నేహితునికి చెప్పాడు. అతను స్నేహితుడి బాధ చూసి చలించిపోయాడు. తన బంధువుల సాయంతో మోహన్ ప్రసాద్ తివారి దంపతులకు తెలియజేశాడు. మీ కొడుకు బతికే ఉన్నాడు. ఫలానా ప్రాంతంలో ఉన్నాడు అని చెప్పాడు.

అంతే కొడుకు క్షేమంగానే ఉన్నాడని తెలిసిన ఆ కన్నవారి ఆనందానికి అవధుల్లేవు. తమ కల ఫలించిందనీ..తమ ఎదురు చూపులు ఫలించాయని ఉప్పొంగిపోయారు. వెంటనే మోహన్ ఇంటి చుట్టుపక్కలగల వారు ఆ దంపతులను కారులో ఢిల్లీలోని కృష్ణా చంద్ ఇంటికి పంపించారు. అక్కడవారు కుమారుడిని కలుసుకున్నారు 30 ఏళ్ల తరువాత. కొడుకుతో పాటు కోడలు, ముగ్గురు మనుమలను అక్కున చేర్చుకున్నారు. ‘‘ఏరా..ఇంతకాలానికి గానీ మేం గుర్తు రాలేదా? మమ్మల్ని చూడాలనిపించలేదా?’’ అని తల్లిదండ్రులు ఆర్థ్రంగా అడుగుతుంటే ఏం చెప్పాలో..ఎలా చెప్పాలో తెలీక కన్నీటితో కన్నవారి గుండెల్లో వాలిపోయాడు ముగ్గురు పిల్లల తండ్రి.