కేబినెట్‌లో విషాదం, కరోనాతో మహిళా మంత్రి మృతి, సంతాపం తెలిపిన సీఎం

  • Published By: naveen ,Published On : August 2, 2020 / 12:55 PM IST
కేబినెట్‌లో విషాదం, కరోనాతో మహిళా మంత్రి మృతి, సంతాపం తెలిపిన సీఎం

కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులనూ కాటేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ మంత్రి కరోనాకు బలయ్యారు. ఉత్తర ప్రదేశ్‌ మంత్రివర్గంలో విషాదం నెలకొంది. యోగి కేబినెట్ లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న కమల్ రాణి వరుణ్(Kamal Rani Varun) కరోనాతో కన్నుమూశారు. ఆమె వయస్సు 62 సంవత్సరాలు. లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం(ఆగస్టు 2,2020) ఉదయం 9.30కి ఆమె ప్రాణాలు విడిచినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని రోజులుగా మంత్రి కమలా రాణి వెంటిలేటర్ పై ఉన్నారు. ఆమె ఇతర అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

జూలై 18 నుంచి ఆసుపత్రిలోనే:
కరోనా పాజిటివ్ అని తేలడంతో జూలై 18న లక్నోలోని సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌ లో ఆమెని చేర్పించారు. అక్కడ అత్యవసర చికిత్సను అందించారు. అయినప్పటికీ.. ఆమె ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడలేదు. రెండు రోజుల కిందట ఆరోగ్యం మరింత విషమించింది. ఫలితంగా కమల్ రాణిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినా లాభం లేకపోయింది.

సీఎం యోగి తీవ్ర విచారం:
మంత్రి మృతి పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర‌ విచారం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కమలా.. చాలా గొప్ప ప్రజా నేత, సామాజిక కార్యకర్త అని కొనియాడారు. మంత్రిగా సమర్థవంతంగా పని చేశారని కితాబిచ్చారు. కమల్ రాణి మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. పార్టీలో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. పేద ప్రజలకు చేరువగా ఉండటానికి అహర్నిశలు శ్రమించారని చెప్పారు. సేవా భారతి తరఫున పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించడంపై తనదైన ముద్రను వేశారని అన్నారు.

పర్యటన రద్దు చేసుకున్న సీఎం:
మంత్రి మ‌ర‌ణం నేప‌థ్యంలో రామ మందిర‌ ఫౌండేషన్ వేడుక సన్నాహాలను సమీక్షించ‌డానికి ప్లాన్ చేసుకు‌న్న అయోధ్య ప‌ర్య‌ట‌నను సీఎం యోగి ర‌ద్దు చేసుకున్నారు. మే 3 1958న జన్మించిన కమల్ రాణి వరుణ్ ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె పదకొండవ, పన్నెండవ లోక్ సభ సభ్యురాలు కూడా. క‌మల్ రాణి కాన్పూర్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ చదివారు.

1989లో తొలిసారిగా ఎన్నికల బరిలోకి:
కమల్ రాణి వరుణ్ బీజేపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989లో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ తరఫున కాన్పూర్ మున్సిపాలిటీకి ఎన్నికయ్యారు. క్రమంగా మంత్రి స్థాయికి ఎదిగారు. ఘాతమ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాతమ్‌పూర్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో చేరారు.