Nurse who slapped the doctor : ఆసుపత్రిలో పోలీసుల కళ్ల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్..

Nurse who slapped the doctor : ఆసుపత్రిలో పోలీసుల కళ్ల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్..

Rampur District Hospital

Rampur District hospital : కరోనా రోగులకు సేవలు చేసి చేసీ..డాక్టర్లు, నర్సులు సహనం కోల్పోతున్నారా? అన్నట్లుగా ఉంది ఓ హాస్పిటల్ లో ఓ నర్సు, డాక్టర్ కొట్టుకున్న తీరు చూస్తే. సాక్షాత్తూ పోలీసులు అక్కడ ఉన్నా..వారి కళ్లముందే ఓ డాక్టర్,నర్సు కొట్టుకున్నవీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్ జిల్లా ఆసుపత్రిలో సోమవారం (ఏప్రిల్ 26,2021) డాక్ట‌ర్‌కు, న‌ర్సుకు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఇద్దరూ కూడా ఒక‌రిని ఒక‌రు దారుణంగా తిట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత? అని దూషించుకున్నారు. చివ‌రికి స‌హ‌నం కోల్పోయిన ఆ న‌ర్సు డాక్ట‌ర్ చెంప‌పై చెళ్లుమని ఒక్కటిచ్చింది. దాంతో సదరు డాక్ట‌ర్ కు ఒళ్లు మండిపోయింది. పైగా అందరి ముందూ నాపై చేయిచేసుకంటావా? అంటూ తిరిగి నర్సుపై డాక్టర్ దాడికి పాల్ప‌డ్డాడు.

పోలీసుల ముందే జరగడం మరో విషయం. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిపైనా కూడా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్‌జీ మిశ్రా కూడా ఘ‌ట‌న‌పై ఇద్ద‌రిని వేర్వేరుగా విచారించారు. డాక్ట‌ర్‌, న‌ర్సు ఇద్ద‌రితో విడివిడిగా మాట్లాడాన‌ని..ఇద్ద‌రూ కూడా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వారికి సేవలు చేసే పనిలో పడి సరైన విశ్రాంతి లేక..ప‌ని ఒత్తిడికి గురై..ఒత్తిడి త‌ట్టుకోలేక‌నే స‌హ‌నం కోల్పోయి ఇలా ప్రవర్తించామని చెప్పార‌ని మిశ్రా తెలిపారు. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామని తెలిపారు.

కాగా..కరోనా ప్రజలతో ఆటలాడుకుంటోంది. ప్రాణాల్ని సైతం హరిస్తోంది. మరోవైపు విశ్రాంతి లేక పగలు..రాత్రిళ్లు కరోనా బాధితులకు చికిత్సలు చేసి చేసి డాక్టర్లు,నర్సులతో పాటు వైద్య సిబ్బంది అలసిపోతున్నారు. సరైన నిద్రహారాలు లేక అల్లాడిపోతున్నారు. ఈక్రమంలో దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి తప్ప ఏమాత్రం తగ్గటంలేదు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య సిబ్బంది నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ.. వారు రోగులకు సేవలందిస్తూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి మధ్య విధులు నిర్వర్తించడం తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ప‌లు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది ఒత్తిడికి గురై స‌హ‌నం కోల్పోయి ఇలా ఒక‌రిపై మ‌రొక‌రు తిట్టుకోవటంతో పాటు అక్కడక్కడా ఇలా కొట్టుకునే వరకూ వెళుతోంది.