సీఏఏపై అమెరికా యువతి విమర్శలు…సోషల్ మీడియాలో ప్రశంసలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 25, 2019 / 01:50 PM IST
సీఏఏపై అమెరికా యువతి విమర్శలు…సోషల్ మీడియాలో ప్రశంసలు

ఫిరోజా అజీజ్… అమెరికాకు చెందిన ఈ యువతి చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని ఆరోపిస్తూ నెల రోజుల క్రితం చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 17 ఏళ్ల ఈ అమెరికా యువతి  భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై స్పందించింది. సీఏఏను వ్యతిరేకిస్తూ వీడియో తీసి ట్విట్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఎప్పటి మాదిరిగానే చర్మ సంరక్షణ టిప్స్‌ చెప్పిన ఫిరోజా.. అనంతరం సీఏఏపై స్పందించింది. సీఏఏ అనైతికమైన చట్టం. భారతదేశానికి వలస వచ్చిన ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ చట్టం ఒప్పుకోదు. వారిని మాత్రమే మినహాయించి మిగతావారికి పౌరసత్వం ఇవ్వడం దారుణం. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వారిని మతం పేరుతో మినహాయించడం సరియైనది కాదు. ఇది అనైతిక చర్య, మతం అనేది దేశ భక్తిని చూపించదని, ముస్లిం అయినా, హిందువైనా అందరూ సమానమే అని ఫిరోజా అన్నారు.

ఫిరోజా వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ నేను ఫిరోజాకు మద్దతు తెలుపున్నాను. ఫిరోజా గారు మంచి వీడియో తీశారు. మతపరంగా పౌరసత్వం తిరస్కరిస్తున్నారనేది వాస్తవం కాదు. కానీ మీరు మంచి వీడియో తీశారు. సీఏఏ గురించి ప్రతి ఒక్కరు ఆలోచించేలా చెప్పారు. మీరు వివరించిన విధానం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంది. ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని తీయండింటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.