ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడండి, ప్రభుత్వ అధికారులకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

  • Published By: naveen ,Published On : July 11, 2020 / 09:43 AM IST
ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడండి, ప్రభుత్వ అధికారులకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ముఖ్యమైన పనులకు ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో హ్యాకింగ్, సైబర్ దాడులు ఎక్కవయ్యాయి. సైబర్ నేగరాళ్లు.. ఫోన్లు, కంప్యూటర్లను హ్యాక్ చేసి విలువైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. దీంతో వ్యక్తిగత నష్టం జరుగుతోంది. కొన్ని సమయాల్లో దేశ భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోంమంత్రిత్వశాఖలోని సైబర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ (సీఐఎస్‌) విభాగం సైబర్‌ నేరాల బారినపడకుండా ఉండేలా ప్రభుత్వ అధికారులకు ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వానికి చెందిన రహస్యాలు బయటకు రాకుండా చూడటమే.

మార్గదర్శకాల్లో ప్రధానమైనవి:
* ఆయా ప్రభుత్వశాఖలకు సంబంధించి కీలకమైన పనులను ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండా, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంప్యూటర్‌ ద్వారానే చేయాలి.
* ప్రతి ఒక్కరూ అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులతో కూడిన అత్యంత దృఢమైన పాస్‌వర్డ్‌ రూపొందించుకోవాలి.
* ప్రతి ప్రభుత్వ ఉద్యోగీ తాను వాడుతున్న కంప్యూటర్‌లోని ఆపరేటింగ్‌ వ్యవస్థ, సాఫ్ట్‌వేర్‌, యాంటీ వైరస్‌లు ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చూసుకోవాలి. వీటికి సంబంధించిన ఆటో అప్‌డేట్‌ వ్యవస్థనూ ఆన్‌లోనే ఉంచుకోవాలి.
* ఎప్పటికప్పుడు సమాచారాన్ని బ్యాకప్‌ తీసుకుంటుండాలి.
* ప్రభుత్వానికి చెందిన సమాచారం ఏదీ ప్రైవేట్‌ క్లౌడ్‌ సర్వీస్‌లో నిల్వ చేయకూడదు. ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఎవరైనా అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
* పాస్‌వర్డ్‌ చోరీ ద్వారా సాధారణంగా సైబర్‌ నేరగాళ్ళు కంప్యూటర్‌, ట్యాబ్‌, ఫోన్లలోకి చొరబడి కీలకమైన సమాచారం చోరీ చేస్తుంటారు. వారి నుంచి రక్షణకు పాస్‌వర్డ్స్‌ను తరచూ మార్చుతుండాలి. ‘పాస్‌వర్డ్‌ గుర్తుంచుకో’(రిమెంబర్) సదుపాయం వాడుకోవద్దు.
* ప్రభుత్వం ఇచ్చిన ఈ-మెయిల్‌ చిరునామానే వాడాలి.
* కీలకమైన సమాచారం ఏదీ ఈ-మెయిల్‌ ద్వారా పంపొద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పంపాల్సి వస్తే సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలి.
* ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న వారెవరూ ప్రభుత్వం సమకూర్చిన ఎలక్ట్రానిక్‌ డివైజ్ ల ద్వారా సోషల్ మీడియాను వాడకూడదు.