CAA : రగులుతున్న యూపీ..రెచ్చిపోతున్న అల్లరిమూకలు

  • Published By: madhu ,Published On : December 21, 2019 / 01:29 AM IST
CAA : రగులుతున్న యూపీ..రెచ్చిపోతున్న అల్లరిమూకలు

ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. లక్నోలో మొత్తం 350 మందిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడేవారి ఆస్తుల వేలం వేస్తామని సీఎం యోగీ ఆదిత్యనాధ్ ప్రకటించినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మొత్తంగా యూపీ రగులుతోంది. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు ఇంకొన్ని రోజులు పొడిగించారు.

గోరఖ్ పూర్, ముజఫర్‌నగర్ సహా మొత్తం 15 జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంభాల్ ఏరియాలో ఆందోళనకారులు పదే పదే పోలీసులపై రాళ్లు విసిరిన ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా అల్లరిమూకని గుర్తించే పనిలో పడ్డారు. ఫిరోజాబాద్‌లో అల్లరిమూకల రాళ్లదాడిలో ఒక పోలీస్ తీవ్రంగా గాయపడ్డారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3వేలమందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. 19 ఎఫ్ఐఆర్‌లను గుర్తు తెలియని వ్యక్తులపై నమోదు చేయగా…వారిలో 17మందిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపింది. మవూ, వారణాసి, ఆలీగర్ ప్రయాగరాజ్, బదౌహి, బులంద్ షహర్, బహ్రెయిచ్ సహా పలు ప్రాంతాలలో ఆందోళనకారుల విధ్వంసకాండ ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అలీగర్ ఏరియాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం కావడంతో చాలా ప్రాంతాలలో నమాజ్ చేసుకోవడానికి ముస్లింలు తరలిరావడంతో పోలీసులు చూస్తుండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సాకుగా అల్లరిమూకలు పోలీసులపై రాళ్లు రువ్వడం, బాటిళ్లు విసరడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంటోన్న ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించారు.