Tirath Singh Rawat Resigns : ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్‌సింగ్‌ రావత్‌ రాజీనామా

 ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్‌సింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు. సీఎం పదవిని అధిష్టించిన నాలుగు నెలల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Tirath Singh Rawat Resigns : ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్‌సింగ్‌ రావత్‌ రాజీనామా

Tirath Singh Rawat Resigns

Tirath Singh Rawat Resigns : ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్‌సింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు. సీఎం పదవిని అధిష్టించిన నాలుగు నెలల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గఢ్‌వాల్‌ ఎంపీ అయిన తీరత్‌సింగ్‌ రావత్‌ ఈ ఏడాది మార్చి 10న తివేంద్ర సింగ్‌ రావత్‌ స్థానంలో కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారు ఆరు నెలలలోపు రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. కాగా, ఉత్తరాఖండ్‌కు శాసన మండలి లేదు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీరత్‌సింగ్‌ కు సెప్టెంబర్‌ 10 వరకు గడువు ఉన్నది. రాష్ట్రంలోని గంగోత్రి, హల్ద్వానీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడంపై ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా తక్కువ.

దీంతో సెప్టెంబర్‌ 10లోగా సీఎం తీరత్‌సింగ్‌ రావత్‌ అసెంబ్లీకి ఎన్నిక కాకపోతే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో నెలకొన్న ఈ అనిశ్చితిని తొలగించేందుకు కొత్త సీఎంను నియమించాలని బీజేపీ ఆలోచిస్తోంది. గత 3 రోజులుగా ఆయన బీజేపీ అధిష్టానంతో మంతనాలు చేస్తూ ఉన్నారు.

ఈ నేపధ్యంలో 1951 ప్రజాప్రతినిధుల చట్టం-1951 ప్రకారం ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి లేనందున.. రాజీనామా చేయాలని నడ్డా ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం సూచనలమేరకే తీరత్‌సింగ్‌ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీరత్ సింగ్ పౌరీ గర్వాల్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజీనామా సమర్పణకు ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ను కూడా ఆయన కోరినట్లు తెలుస్తోంది.