Uttarakhand Results : ఉత్తరాఖండ్.. హోరాహోరీ తప్పదా..?

అధికార బీజేపీ ఉత్తరాఖండ్‌లో మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి. కాంగ్రెస్‌ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు లెక్కగట్టాయి.

Uttarakhand Results : ఉత్తరాఖండ్.. హోరాహోరీ తప్పదా..?

Uttarakhand

ఉత్తరాఖండ్ నీదా? నాదా? అంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమల దళం ఉవ్విళ్లూరుతుంటే… ఆ పార్టీని ఉలిక్కిపడేలా చేయాలనుకుంటోంది కాంగ్రెస్. అక్కడ తమ జెండాను రెపరెపలాడించడంపై కన్నేసింది. మరోవైపు.. ఈ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో ఉత్కంఠ మరింత పెరిగింది. హంగ్ తప్పదన్న సూచనలతో ఆయా పార్టీలకు, అభ్యర్థులకు టెన్షన్‌ పట్టుకుంది. అయితే.. ఎవరికి వారే గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read This : Goa Results : గోవా అంటేనే గోడ దుంకుడు..! అధికారంపై పార్టీల్లో గుబుల్

ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా… అధికారం దక్కాలంటే సగానికిపైగా స్థానాల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అంటే… ఉత్తరాఖండ్‌లో మ్యాజిక్ ఫిగర్ అయిన 36 సీట్లను సంపాదించాల్సి ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండగా… ఏ పార్టీ అధికారం సాధిస్తుందన్నది మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ నెలకొంటుందని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. ఇండియాటుడే… బీజేపీకి 36 నుంచి 46 సీట్లు వస్తాయంటోంది. అంటే మెజారిటీ మార్క్ దాటినట్లే. ఇక కాంగ్రెస్‌కు 20నుంచి 30 సీట్లు… ఇతరులకు 4 నుంచి 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ABP సీ ఓటర్‌ మాత్రం కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపింది. బీజేపీకి 26నుంచి 32 సీట్లు వస్తే కాంగ్రెస్‌కు 32 నుంచి 38వరకూ రావొచ్చని అంచనా వేసింది. ఇతరులు 3నుంచి 9 చోట్ల గెలవొచ్చని చెప్పింది. జన్‌కీ బాత్‌… బీజేపీకి 32 నుంచి 41, కాంగ్రెస్‌కు 27 నుంచి 35వరకు సీట్లు రావొచ్చని అంచనా వేసింది. టుడేస్‌ చాణక్య మాత్రం బీజేపీకే గెలుపు కట్టబెట్టింది. బీజేపీకి 43, కాంగ్రెస్‌కు 24, ఇతరులకు 3 సీట్లు రావొచ్చని చెప్పింది. టైమ్స్‌నౌ కూడా బీజేపీకి 37, కాంగ్రెస్‌కు 31 ఇతరులకు 2 సీట్లు రావొచ్చని చెప్పింది.

Read This : Punjab Results : పంజాబ్ పల్స్ ఏంటి..? కేజ్రీవాల్ ‘చీపురు’తో ఊడ్చేయనున్నారా..?

ఉత్తరాఖండ్‌లో హంగ్ తప్పదన్న వార్తలతో బీజేపీ-కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇప్పటికే అక్కడ మకాం వేసారు. పొత్తుల కోసం అనధికార చర్చలు మొదలు పెట్టారు. బీజేపీ.. ఆ పార్టీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయను డెహ్రాడున్‌కు పంపితే.. దానికిపోటీగా కాంగ్రెస్… రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడాను డెహ్రాడూన్‌ పంపించింది. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కింగ్ మేకర్లు ఎవరన్న అంచనాల్లో వారు తలమునకలై ఉన్నారు. స్వతంత్రులుగా గెలిచే అవకాశమున్నవారిని ముందుగానే తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫ‌లితాల అనంత‌రం ఎమ్మెల్యేల బేర‌సారాల‌కు తెర‌లేస్తుంద‌నే అంచ‌నాల న‌డుమ ప్రధాన పార్టీలు త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు సిద్ధమ‌య్యాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను క్యాంప్‌లకు తరలించడం కోసం ఇప్పటికే హెలికాఫ్టర్లను సిద్ధం చేసింది. రిజల్ట్స్‌ అనంత‌రం… గెలుపొందిన ఏ ఒక్క అభ్యర్థి ప్రత్యర్ధి శిబిరంలోకి వెళ్లకుండా నిరోధించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ భూపేష్ బాఘేల్‌కు క‌ట్టబెట్టింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపొందిన అభ్యర్ధులంతా డెహ్రడూన్‌కు తిరిగిరావాల‌ని ఇప్పటికే ఆ పార్టీ ఆదేశించింది.

ఉత్తరాఖండ్‌లో చిన్న పార్టీలు, స్వతంత్రులకు డిమాండ్ ఉండటంతో ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది బీజేపీ. చివరి ఓటు లెక్కిచే వరకూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు అందాయి. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి దుష్యంత్ కుమార్ గౌతమ్ కూడా ఉత్తరాఖండ్‌లోనే మకాం వేశారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని చాలా మంది ఊహించారు. ఇండియా టుడే- యాక్సిస్… కాంగ్రెస్‌కు 12 నుంచి 21, బీజేపీకి 46 నుంచి 53, ఇతరులకు 2 నుంచి 6 సీట్లు వస్తాయని చెప్పింది. న్యూస్ 24- టుడే చాణక్య… కాంగ్రెస్‌కు 15, బీజేపీకి 53, ఇతరులకు 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టీవీ- సీవోటర్ కాంగ్రెస్‌కు 32, బీజేపీకి 29నుంచి 35, ఇతరులకు 5 సీట్లు వస్తాయని లెక్కగట్టింది. అందరి అంచనాలను నిజం చేస్తూ 57 సీట్లతో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు 11, ఇతరులకు 2 సీట్లు వచ్చాయి. అయితే… ఇక్కడ బీజేపీ ప్రభుత్వం గతేడాది చాలా అస్థిరతను చవిచూసింది. ఒకే ఏడాదిలో ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. ఆ ఎఫెక్ట్‌ తాజా ఫలితాలపై పడుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

అయితే… అధికార బీజేపీ ఉత్తరాఖండ్‌లో మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి. కాంగ్రెస్‌ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు లెక్కగట్టాయి. మరోవైపు… ఈసారి… బీఎస్పీ, ఉత్తరాఖండ్ క్రాంతిదళ్, ఉత్తరాఖండ్ జన్ ఏక్తా పార్టీ , స్వతంత్ర అభ్యర్థులు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన నెంబర్ గేమ్ లో కింగ్ మేకర్లు అయ్యే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరి ఆ అంచనాలు నిజమవుతాయా? లేదంటే ఊహించని ఫలితాలు వస్తాయా? అనేది తెలియాలంటే.. మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.