Vaccine Dose Duration : రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉంటే అంత మంచిది

Vaccine Dose Duration : రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉంటే అంత మంచిది

Vaccination Drive Govts Expert Panel Mulls Increasing Gap Between Covishields Two Doses To Boost Efficacy

Vaccine Dose Duration :  కరోనా వైరస్ ను ఎదుర్కోటానికి తీసుకునే వ్యాక్సిన్ తొలి డోసు… రెండో డోస్‌.. మధ్య ఎంత ఎక్కువ గ్యాప్‌ ఉంటే అంత మంచిదంట.. ఇంకేం.. వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు ఇదే సరైన చాన్స్‌.. మొదటి డోస్‌ వేసిన వారికి రెండో డోస్‌ వేసేందుకు ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటే.. ఈలోపు మరికొంత మందికి మొదటి డోస్‌ వేసేయొచ్చు. అసలు ఈ డోసుల మధ్య గ్యాప్‌ వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కే ఈ నిబంధన వర్తిస్తుందా? గ్యాప్‌ వల్ల పెరుగుతున్న ఎఫికసీ ఎంతో ఒకసారి చూద్దాం.

దేశంలో కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు 45 ఏళ్లు మించిన వారికి సైతం మొదటి డోస్‌ టీకా ఇవ్వడం పూర్తి కాలేదు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా టీకాలేస్తామన్నారు. కానీ, అది ఇప్పుడిప్పుడే సాధ్యమయ్యేలా లేదు. ఈ సమయంలో ఒక అధ్యయనం ప్రభుత్వానికి కాస్త ఉపశమనం ఇచ్చేలా ఉంది. వ్యాక్సిన్ల కొరత ఒకపక్క.. ఎంత ఆల‌స్యంగా ఇస్తే వ్యాక్సిన్ సామ‌ర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంద‌ని చెబుతున్న అధ్యయ‌నాలు మరోపక్క. దీంతో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే విరామాన్ని మ‌రోసారి పెంచే ఆలోచ‌న చేస్తోంది నిపుణుల క‌మిటీ. దీనిపై వ‌చ్చే వారం తుది నిర్ణయం తీసుకోనుంది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలిసారి వ‌చ్చిన‌ప్పుడు రెండో డోసును 4 నుంచి 6 వారాల మ‌ధ్య తీసుకోవాల‌ని సూచించారు. ఆ త‌ర్వాత ఏప్రిల్‌లో ఆ విరామాన్ని ఆరు నుంచి ఎనిమిది వారాలుగా నిర్ధరించారు. ఆ గ్యాప్‌ ఉంటే.. వ్యాక్సిన్ మ‌రింత మెరుగ్గా ప‌ని చేస్తుందంటూ కేంద్రం ప్రక‌టించింది. ఇప్పుడు ఆ స‌మ‌యాన్ని మ‌రింత పెంచే ఆలోచ‌న చేస్తోంది ప్రభుత్వం. అదే జ‌రిగితే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ కొర‌త నేప‌థ్యంలో త‌యారీదారుల‌పై ఒత్తిడి కాస్తయినా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

మార్చి నెల‌లో లాన్సెట్‌లో ఓ అధ్యయ‌నాన్ని ప్రచురించారు. దాని ప్రకారం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 12 వారాల త‌ర్వాత తీసుకుంటే సామ‌ర్థ్యం 81.3 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. అదే ఆరు వారాలలోపు తీసుకుంటే మాత్రం 55.1 శాతం సామర్థ్యం మాత్రమే ఉంద‌ని ప‌రిశోధ‌కులు వెల్లడించారు.

ఇక బ్రిట‌న్‌, బ్రెజిల్‌ల‌లో జ‌రిగిన చివ‌రి ద‌శ ట్రయ‌ల్స్‌లో వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం దాకా ఉంటున్నట్లు తేలింది. అలా జ‌ర‌గాలంటే ముందు స‌గం డోసు ఇచ్చి, నెల త‌ర్వాత మొత్తం డోసు ఇవ్వాల్సి ఉంటుంద‌ని ఈ ట్రయ‌ల్స్ తేల్చాయి. ఇక ఇప్పటికే యూకేలో రెండు డోసుల మధ్య విరామం 12 వారాలుంటే, కెన‌డాలో 16 వారాల విరామం తర్వాత వేస్తున్నారు. రెండో డోసుల మ‌ధ్య ఎక్కువ స‌మ‌యం ఉంటే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్నట్లు నిపుణులు చెబుతుండడమే దీనికి కారణం.

మన దగ్గర ఇప్పుడు వ్యాక్సిన్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలోనూ గ్యాప్‌ ఎక్కువ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తే వ్యాక్సిన్ల కొర‌త‌ను కాస్తయినా అధిగ‌మించే వీలుంటుంది. రెండో డోసు తీసుకునే వాళ్లు మ‌రికొంత ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావ‌డంతో ఆ మేర‌కు మ‌రికొంత మందికి తొలి డోసు వేసే అవ‌కాశం ద‌క్కుతుంది. ఇలా వ్యాక్సిన్ల కొర‌త‌కు కాస్త చెక్ పెట్టవ‌చ్చని అంటున్నారు.

ఎక్కువ గ్యాప్ త‌ర్వాత రెండో డోసు తీసుకుంటే ఎక్కువ రక్షణ ఉండ‌టంతోపాటు ఆ లోపు క‌నీసం ఒక్క డోసు తీసుకున్న వారు కాస్తయినా సుర‌క్షితంగా ఉంటారు. ఇలా రెండు ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. వాస్తవానికి దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండగా, వైరస్ విరుగుడు కోసం తయారైన వ్యాక్సిన్ల వాడకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ టీకా తొలి డోసుకు, రెండో డోసుకు మధ్య గ్యాప్‌ను ఆరు నుంచి ఎనిమిది వారాలకు పెంచుతూ నిర్ణయించింది.

వ్యాక్సినేషన్‌ మొదలైన తొలి రోజుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య కేవలం నాలుగు వారాల విరామం ఉండేది. ఇప్పుడా గడువును 6 నుంచి 8 వారాలుగా ఉంది. అయినా కూడా చాలా మంది రెండో డోసు కూడా అందని పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ల కొరత తీవ్రమవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కొవిషీల్డ్‌ సామర్థ్యంపై కొత్త అధ్యయనాలు వెలువడడంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమవుతోందని చెబుతున్నారు. రెండు డోసుల మధ్య విరామాన్ని కనీసం 12 వారాలు ఫిక్స్‌ చేస్తే కొరతను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఎఫికసీ కూడా మెరుగవుతుందని భావిస్తున్నారు.

కొవిషీల్డ్‌ తయారీదారు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాల కూడా ఇటీవల కీలక ప్రకటన చేశారు. కొవిషీల్డ్ టీకా తొలి డోసు తర్వాత రెండో డోసును రెండున్నర నుంచి మూడు నెలల వ్యవధితో తీసుకుంటే వ్యాక్సిన్ సామర్థ్యం 90శాతానికి పెరిగే అవకాశముందని పూనావాలా తెలిపారు. ఒక నెల తేడాతో రెండు డోసులను తీసుకున్న ప్రయోగంలో టీకా సామర్థ్యం 60 నుంచి 70 శాతంగా ఉన్నట్టు తేలిందని, దీనికి సమాంతరంగానే మరో ప్రయోగం కూడా చేశారని పూనావాలా అన్నారు. రెండు నుంచి మూడు నెలల విరామంతో రెండో డోసు తీసుకున్నప్పుడు టీకా సామర్థ్యం 90 శాతం కనిపించిందన్నారు పూనావాలా.

మరోపక్క, 50 ఏళ్ల లోపు వారిలో తొలి డోసు తీసుకున్నాక నెల రోజుల్లోనే టీకా అద్భుతమైన రక్షణనిస్తున్నదని పూనావాలా వివరించారు. రికవరీ అయిన కరోనా పేషెంట్‌లో కన్నా సింగిల్‌ డోస్‌ వేసుకున్న వారిలో ఎక్కువ ప్రొటెక్షన్ కనిపిస్తున్నదని తెలిపారు. కానీ, దీర్ఘకాలిక రక్షణ కోసం రెండో డోసు తప్పనిసరిగా వేసుకోవాలని చెబుతున్నారు. రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. కరోనాకు మందు వచ్చే వరకు లేదా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు వీటిని అనుసరించడం ఉత్తమమని అన్నారు.