Vijay Mallya: మాల్యాకు లండన్ కోర్టు షాక్.. భారత బ్యాంకులకు అనుకూల తీర్పు!

మన దేశంలో బ్యాంకులకు నిలువునా వేల కోట్ల రూపాయలకు ముంచేసి లండన్ పారిపోయిన బడా వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ స్టేట్ బ్యాంకు (SBI) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా లండన్ హైకోర్టులో సోమవారం తీర్పు వెలువడింది.

Vijay Mallya: మాల్యాకు లండన్ కోర్టు షాక్.. భారత బ్యాంకులకు అనుకూల తీర్పు!

Vijay Mallya

Vijay Mallya: మన దేశంలో బ్యాంకులకు నిలువునా వేల కోట్ల రూపాయలకు ముంచేసి లండన్ పారిపోయిన బడా వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ స్టేట్ బ్యాంకు (SBI) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా లండన్ హైకోర్టులో సోమవారం తీర్పు వెలువడింది. ఇండియాలోని మాల్యా ఆస్తులను జప్తు చేసుకోవడానికి ఈ కన్సార్షియంలోని బ్యాంకులకు యూకే హైకోర్టు అనుమతి ఇచ్చింది.

మాల్యాను భారత్‌ కు అప్పగింత కేసును సోమవారం విచారించిన యూకే కోర్టు ఆయన దివాళా తీసినట్లు సంచలన ప్రకటన చేసింది. మాల్యా స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని వాటి వేలం ద్వారా బ్యాంకులు తమ రుణాలను జమ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది. ఇండియాలో మాల్యా ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునేందుకు అనుకూలంగా వారి దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యుకే కోర్టు సమర్థించింది.

ఈ మేరకు లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. తాజా ఆదేశాలతో కొన్నాళ్లుగా మ్యాలాపై సుదీర్ఘం పోరాటం చేస్తున్న భారత బ్యాంకులకు భారీ విజయం లభించినట్టైంది. కోర్టు వెలువరించిన ఈ నిర్ణయం తరువాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విజయ్ మాల్యా ఆస్తులను అమ్మడం ద్వారా రికవరీ చేసుకోవడానికి మార్గం సులభతరం అయింది.

ఇప్పుడు మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా మూసివేసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాన్ని ఇప్పుడు భారత బ్యాంకులు తిరిగి పొందగలవు. ఏప్రిల్‌లో లండన్ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఎస్బీఐ (SBI) నేతృత్వంలోని కన్సార్టియం పారిపోయిన వ్యాపారవేత్త నుంచి రుణాల రికవరీ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఒక్క కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించే మాల్యా 9 వేల కోట్ల రూపాయలు రుణపడి ఉన్నారు. మొత్తానికి ఇండియన్ బ్యాంకులకు ఇప్పుడు మాల్యా ఆస్తులపై హక్కు వచ్చేసింది.