Rahul Gandhi :పెగాస‌స్ పై మళ్లీ పార్లమెంట్ లో చర్చ.. సుప్రీం తీర్పుతో నమ్మకమొచ్చింది

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం

Rahul Gandhi :పెగాస‌స్ పై మళ్లీ పార్లమెంట్ లో చర్చ.. సుప్రీం తీర్పుతో నమ్మకమొచ్చింది

Rahul

Rahul Gandhi దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం..ఈ వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇవాళ వెలువరించిన తీర్పును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. సుప్రీంకోర్టు ప్ర‌క‌ట‌న‌తో పెగాస‌స్‌కు సంబంధించి నిజం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే విశ్వాసం త‌న‌కు ఏర్ప‌డింద‌ని రాహుల్ తెలిపారు. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కూడా తాము ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తామ‌ని, దీనిపై పార్ల‌మెంట్‌లో చ‌ర్చ జ‌రిగేలా చూస్తామ‌ని రాహుల్‌గాంధీ స్ప‌ష్టంచేశారు.

గ‌త పార్ల‌మెంట్ సెష‌న్‌లోనే తాము పెగాస‌స్ అంశాన్ని లేవ‌నెత్తామ‌ని రాహుల్‌గాంధీ గుర్తుచేశారు. ఇవాళ ఈ విష‌యంలో సుప్రీంకోర్టు త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింద‌ని, దీనిపై తాము ఏదైతే చెబుతున్నామో దానికి కోర్టు మ‌ద్ద‌తు ప‌లికింద‌న్నారు. పెగాసస్‌కు సంబంధించి తాము 3 ప్ర‌శ్న‌లు అడుగుతున్నామ‌న్నారు. పెగాస‌స్‌పై అథారిటీ ఎవ‌రికి ఉన్న‌ది..? దీన్ని ఎవ‌రిపై ప్ర‌యోగిస్తున్నారు..? ఈ స్పైవేర్ ద్వారా మ‌రే దేశానికైనా దేశ ప్ర‌జ‌ల స‌మాచారం పొందేందుకు అనుమ‌తి ఉందా? అనేవి త‌మ మూడు ప్ర‌శ్న‌ల‌ని రాహుల్ తెలిపారు. విప‌క్ష నేత‌ల‌పై నిఘా కోసం పెగాసస్ స్పై వేర్‌ను వినియోగించ‌డం అంటే భార‌త ప్ర‌జాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు కుయుక్తి ప‌న్న‌డ‌మేన‌ని రాహుల్‌గాంధీ మండిప‌డ్డారు.

మరోవైపు,పెగాసస్ వ్యవహారంపై ఇవాళ విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది.పెగసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశామన్నకోర్టు.. దీనిపై తీసుకున్న చర్యలు, వారి స్పందన గురించి చెప్పేందుకు కేంద్రానికి అనేక అవకాశాలిచ్చామని పేర్కొంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా అసంపూర్ణంగా అఫిడవిట్ సమర్పించిందని అభిప్రాయపడింది. స్పైవేర్‌ను ఉపయోగించామా లేదా అన్నదానిపై కేంద్రం నుంచి కచ్చితమైన సమాధానం రాలేదన్న కోర్టు.. దేశ భద్రత పేరు చెప్పి సమాచారాన్ని ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించిందని వెల్లడించింది. కమిటీ ఏర్పాటుకు కేంద్రం సైతం సుముఖంగా ఉన్న నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేయడం తప్పితే మరో అవకాశం కన్పించలేదని ధర్మాసనం వివరించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

కాగా,సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి..సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ నేతృత్వం వహించనున్నారు.నిపుణుల కమిటీ పనితీరును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి.. నివేదికను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కమిటీని ఆదేశించింది.

అయితే,పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగసస్‌ స్పైవేర్‌తో లక్ష్యంగా చేసుకున్న వారిలో సుమారు 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, జర్నలిస్ట్ లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ALSO READ Bus-Truck Collision : ట్రక్కును ఢీ కొట్టిన బస్సు..ఐదుగురి పరిస్థితి విషమం