అంధుల ఇంటికి రూ. 58 లక్షల బిల్లు

  • Published By: madhu ,Published On : July 25, 2020 / 02:11 PM IST
అంధుల ఇంటికి రూ. 58 లక్షల బిల్లు

అదో నిరుపేద కుటుంబం. భార్య భర్తలు ఇంట్లో ఉంటారు. వీరిద్దరూ అంధులే. వీరింటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నారు. ఏకంగా లక్షల రూపాయలు బిల్లు రావడంతో ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు.

తాము ఉంటున్న ఇంట్లో కేవలం బల్బులు, రెండు ఫ్యాన్ లు మాత్రమే ఉన్నాయని, ఇంత కరెంటు బిల్లు ఎలా వస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఒడిశా రాష్ట్రంలో పంచదయాన్ గ్రామానికి చెందిన ప్రసన్న నాయక్, అతని భార్య (అంధులు) నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో కేవలం నాలుగు విద్యుత్ దీపాలు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. ఏడు నెలలుగా కరెంటు బిల్లు కట్టడం లేదు.

దీంతో భారీగా రూ. 58 లక్షల 85 వేల 844 బిల్లు కట్టాలంటూ పంపించారు. నాయక్ సోదరుడు అజయ్ ఈ బిల్లును చూసి వారికి తెలియచేశారు. దీంతో ఆ అంధ దంపతులు వారు షాక్ తిన్నారు.

ఇంత డబ్బు ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు. తమకు రూ. 58 లక్షల బిల్లు రావడంపై విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. స్పందన రాకపోతే..తాము వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయిస్తామన్నారు.

తన సోదరుడు ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా లేవని అజయ్ వెల్లడించారు. పాత విద్యుత్ మీటర్ ఉందని, నెలకు రూ. 200 నుంచి 250 వరకు బిల్లు వచ్చేదని, 2019, సెప్టెంబర్ నెలలో 18 వేల 560 వచ్చిందన్నారు.

కొంత తగ్గించిన అనంతరం తాము 9 వేల రూపాయలు చెల్లించామన్నారు. గత సంవత్సరం మీటర్ ను మార్చాలని అధికారులు చెప్పారని, 2020, జనవరి నుంచి తమకు కరెంటు బిల్లు రాలేదని స్పష్టం చేశారు.