Putin To Visit India : డిసెంబర్-6న భారత్ కు పుతిన్

21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ డిసెంబర్​ 6న భారత్​కు రానున్నారు. ప్రధానమంత్రి మోదీతో కలిసి ఢిల్లీలో జరిగే సదస్సులో ఆయన

Putin To Visit India : డిసెంబర్-6న భారత్ కు పుతిన్

Modi Putin

Putin To Visit India: 21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ డిసెంబర్​ 6న భారత్​కు రానున్నారు. ప్రధానమంత్రి మోదీతో కలిసి ఢిల్లీలో జరిగే సదస్సులో ఆయన పాల్గొననున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం తెలిపారు. కాగా,భారత్-రష్యా మధ్య చివరిసారిగా 2019లో ఈ సమావేశం జరిగింది. గతేడాది కరోనా కారణంగా ఈ సదస్సు వాయిదా పడింది.

పుతిన్ భారత పర్యటన సందర్భంగా రక్షణ,వాణిజ్య,ఆర్థిక,సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశమున్నట్లు సమాచారం. టెక్నాలజీ అండ్ సైన్స్ రంగానికి సంబంధించి ఓ జాయింట్ కమిషన్ ను కూడా ఈ సమావేశం సందర్భంగా ప్రకటించే అవకాశముంది. ఇక, రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన S-400 మిసైల్ ఢిఫెన్స్ సిస్టమ్స్ మొదటి బ్యాచ్ వచ్చే నెలలోనే భారత్ కు చేరుకోనున్నాయి.

కాగా, డిసెంబర్-6న ప్ర‌ధాని మోదీ- పుతిన్ స‌మావేశానికి ముందు డిసెంబర్-5,6 తేదీల్లో రెండు దేశాల విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల మధ్య 2 ప్లస్​ 2 భేటీ జ‌రుగుతుంద‌ని అరిందమ్ బాగ్చి తెలిపారు. భార‌త్ త‌ర‌ఫున ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంక‌ర్… ర‌ష్యా త‌ర‌ఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ ల‌వ్‌రోవ్‌, ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయిగు ఈ భేటీలో పాల్గొన‌నున్నారు. ఆసియా-పసిఫిక్ (ఇండో-పసిఫిక్) ప్రాంతంలోని పరిస్థితులు,అప్ఘానిస్తాన్, సిరియాలో పరిణామాలతో సహా కీలకమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై మంత్రులు లోతైన చర్చలు జరుపుతారని ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం ప్రతినిధి తెలిపారు.

వాస్తవానికి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్,రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెలలో మాస్కోకు(రష్యా రాజధాని) వెళ్లాల్సి ఉంది. అయితే నవంబర్ 29 నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున ఆ ఫ్లాన్ మార్చబడింది.