వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్, వాడుకున్నోళ్లకు వాడుకున్నంత

10TV Telugu News

vodafone idea bumper offer: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా(Vi) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అన్ లిమిటెడ్ హైస్పీడ్ డేటా ఉచితంగా అందిస్తోంది. రూ.249 ఆపైన అన్ లిమిటెడ్ డైలీ డేటా రీచార్జ్ ప్లాన్లకు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఫ్రీ డేటా వాడుకోవచ్చు. డైలీ డేటా కోటా అలాగే ఉంటుంది. అంతేకాదు, ఈ ప్లాన్‌తో రోల్‌ఓవర్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అంటే రోజువారీ మిగిలిన డేటాను వారాంతంలో వాడుకునే వెసులుబాటు కల్పించారు.

“ఇంటర్నెట్ మరియు OTT లలో నైట్ బింగింగ్ పెరుగుతోంది. కంటెంట్‌ కోసం ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి, Vi అన్‌లిమిటెడ్ హై-స్పీడ్ నైట్-టైమ్ డేటాను ప్రకటించింది. ఎటువంటి పరిమితులు లేకుండా, అదనపు ఖర్చు లేకుండా, ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చాం” అని కంపెనీ తెలిపింది.

”డేటాపై ఎటువంటి పరిమితి లేనందున, వినియోగదారులు వివిధ OTT ప్లాట్ ఫామ్స్ నుండి విభిన్న కంటెంట్‌ను బ్రౌజ్ చేయవచ్చు. డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. రూ.249 మరియు అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్లకు ఇప్పటికే వారాంతపు డేటా రోల్‌ ఓవర్ సదుపాయం ఇచ్చాం. అంటే, రోజులో ఉపయోగించని డేటా వారాంతానికి ఫార్వార్డ్ చేయబడుతుంది. వీటితో పాటు, కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు కూడా డబుల్ డేటాను అందిస్తున్నాయి”
అని కంపెనీ తెలిపింది.