అభిమానం హద్దులు దాటింది: ఈసీ నోటీసులు ఇచ్చింది

  • Published By: vamsi ,Published On : March 18, 2019 / 01:18 AM IST
అభిమానం హద్దులు దాటింది: ఈసీ నోటీసులు ఇచ్చింది

అభిమానంకు హద్దులు గీయగలమా? అసాధ్యమే. కానీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మీద చూపించే అభిమానానికి మాత్రం హద్దు ఉండాలి. హద్దులు గీసుకోకుంటే మాత్రం కష్టాలు పడక తప్పదు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు.

ప్రధాని నరేంద్ర మోడీని విపరీతంగా అభిమానించే జగదీశ్‌ చంద్ర జోషి అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లి కార్డుల్లో గమనిక కింద ‘బహుమతులు తీసుకురావద్దు. వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చే ముందు.. దేశహితం కోరి ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌లో మోడీకి ఓటు వెయ్యండి’ అంటూ రాయించాడు. 
Read Also : నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా తీసుకుంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందంటూ..  జగదీశ్‌ చంద్ర జోషికి రిటర్నింగ్‌ అధికారి నోటీసులు జారీచేశారు. 24 గంటల్లో వ్యక్తిగతంగా ఎన్నికల సంఘం ముందు హాజరు కావాలంటూ ఆదేశించారు. ఈ విషయమై స్పందించిన జోషి ఎన్నికల సంఘాన్ని క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు.

తనకు తెలియకుండా ఈ పని తన పిల్లలు చేశారని, తాను ఏ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయని కారణంగా తనపై కేసు పెట్టరాదంటూ ఎన్నికల సంఘంకు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు మొదలు కానుండగా.. ఏప్రిల్ 22న సదరు కార్డుకు సంబంధించిన పెళ్లి ముహుర్తం ఉంది.