ఓటర్ లిస్టులో సవరణలు చేసుకోండి

  • Published By: chvmurthy ,Published On : September 2, 2019 / 03:53 AM IST
ఓటర్ లిస్టులో సవరణలు చేసుకోండి

ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1, 2019 నుంచి దేశవ్యాప్తంగా  ఓటరు పరిశీలనా కార్యక్రమం చేపట్టింది. సెప్టెంబరు 30 వరకు నెలరోజులపాటు జరిగే ఈ కార్యక్రంలో  క్రౌడ్ సోర్సింగ్ ద్వారా  దేశ వ్యాప్తంగా ఎన్నికల జాబితాకు అవసరమైన  మార్పులు చేర్పులు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రతి కుటుంబానికి చెందిన ఓటరుకు యూజర్ నేమ్ పాస్ వర్డ్ ఇస్తారు. దీంతో ఓటరు నమోదుకు సంబంధించి అన్నిరకాలైన పత్రాలను ఓటరు సులువుగా ఆప్ లోడ్  చేయవచ్చు. అర్హులైన కుటుంబ సభ్యులందరి వివరాలను అప్ లోడు చేయడానికి వీలుకలుగుతుంది.

ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకోవాలని, ఏమైనా సవరణలు ఉంటే చేసుకోవాలని  ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. జాబితాలో ఓటు ఉందో లేదో చూసుకోవడం ఓటర్ల బాధ్యత అని వారు అన్నారు. పోలింగ్ కేంద్రాలతోపాటు ఓటర్ హెల్ప్‌ లైన్ మొబైల్ యాప్, నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ , కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఓటర్ల జాబితాను పరిశీలించుకోవచ్చన్నారు.  ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ఆన్‌ లైన్‌ తో పాటు నిర్ణీత దరఖాస్తు ఫారం పూర్తి చేసి దానికి  ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఫొటోకాపీ జతచేసి పోలింగ్ కేంద్రాల్లో సమర్పించవచ్చన్నారు. జనవరి ఒకటి, దేశవ్యాప్తంగా 90 కోట్ల ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పదిలక్షల కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. బూత్ లెవల్ కేంద్రాల వద్ద బీఎల్‌ఒలను కూడా ప్రభుత్వం  అందుబాటులో ఉంచింది. మార్పుల కోసం సంబంధిత ఓటరుకు సంబంధించిన పాస్‌పోర్ట్, ఆధార్, రేషన్ కార్డు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్‌పుస్తకం, రైతు గుర్తింపు కార్డు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చిన అధికారిక పత్రాలతో సంబంధిత ఎన్నికల సిబ్బందిని, అధికారులను సంప్రతించ వచ్చుని అధికారులు తతెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ (ఎన్వీపీఎస్), ఓటర్స్ హెల్ప్, 1950 కాల్ సెంటర్ ద్వారా తగిన మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. సంబంధిత మార్పుల కోసం ఎన్నికల అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ధారించిన అనంతరం సరిచేస్తారు. మార్పులు, చేర్పుల కోసం ఫారం- 8 దరఖాస్తులు సమర్పించాలి. మరణించిన, చిరునామా మారిన ఓటర్ల కోసం ఫారం-7 అధికారులు  అందుబాటులోఉంచారు . ఇప్పటి వరకు నమోదుకాని ఓటర్ల కోసం 2019 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పీడబ్ల్యుడీ ఓటర్లు 1950 హెల్ప్‌లైన్ ద్వారా వివరాలు తెలియజేస్తే ఓటర్ల నమోదుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు వివరించారు. సవరణ తర్వాత అక్టోబర్‌ 15న ముసాయిదా ఓటర్ల జాబితాను, 2020, జనవరిలో తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది.