ఈసారి ఫలితాలు ఆలస్యం : వీవీ ప్యాట్ చీటీల లెక్కింపే కారణం

  • Published By: madhu ,Published On : May 9, 2019 / 04:20 AM IST
ఈసారి ఫలితాలు ఆలస్యం : వీవీ ప్యాట్ చీటీల లెక్కింపే కారణం

మే 23వ తేదీ ఎప్పుడొస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. ఊపిరిబిగపట్టుకుని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 17వ లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలు మే 23వ తేదీన వెలువడనున్నాయి. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరిగింది. ఈవీఎంలు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లోపే ఫలితాలు తెలిసిపోతున్నాయి. కానీ ఈసారి మాత్రం అలా తెలిసిపోదు. ఎందుకంటే వీవీ ప్యాట్ చీటీలను కూడా లెక్కించాల్సి ఉంది. అందుకనే ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. . ఈవీఎంలలో పోలైన ఓట్లను అన్నింటినీ లెక్కించిన అనంతరమే వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు స్టార్ట్ చేస్తారు. 

ఒక్క వీవీ ప్యాట్ చీటీల లెక్కింపునకు గంట సమయం పడుతుందని..ఒకదాని తర్వాత మరొకటి లెక్కించాల్సి రావడంతో ఫలితాల వెల్లడికి సుమారు ఐదారు గంటల సమయం అదనంగా పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఒక లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉండే ప్రతి శాసనసభా స్థానం నుండి ఐదు చొప్పున వీవీ ప్యాట్‌లను ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. అనంతరం వాటిలోని చీటీలను లెక్కిస్తారు. ఇదంతా పూర్తయిన అనంతరమే ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు.

లెక్కింపు అంతా సజావుగా జరిగితే సాయంత్రం 7-8 గంటల లోపు ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉందని..ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే మరలా లెక్కించాల్సి ఉంటుంది. 
శాసనసభా స్థానాలకు ప్రతి నియోజకవర్గం నుండి 5 పోలింగ్ కేంద్రాల్లోని, లోక్ సభ స్థానాలకు దాని పరిధిలోని ప్రతి శాసనసభా నియోజకవర్గం నుంచి అయిదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్ చీటీలను లెక్కించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏడేసి శాసనసభ స్థానాలున్నాయి.

35 పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్ చీటీలను లెక్కిస్తారు. ప్రతి 25 వీవీ ప్యాట్ చీటీలను ఒక కట్టగా కడుతారు. ఈ కట్టలను పార్టీల వారీగా విభజించి లెక్కిస్తారు. వాటి లెక్కింపు పూర్తయిన తర్వాత రెండో వీవీ ప్యాట్ కట్టను లెక్కిస్తారు. ఇందుకు ప్రత్యేక బూత్‌ను ఏర్పాటు చేస్తారు. అనధికారిక వ్యక్తులు ఎవరికీ ఎంట్రీ ఉండదు. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఈ లెక్కింపును చూస్తుంటారు. మొత్తం లెక్కింపును వీడియో రికార్డింగ్ చేస్తారు.