30 ఏళ్ల నిరీక్షణకు తెర, అయోధ్య రామాలయాన్ని డిజైన్ చేసింది ఈయనే

  • Published By: naveen ,Published On : August 5, 2020 / 11:21 AM IST
30 ఏళ్ల నిరీక్షణకు తెర, అయోధ్య రామాలయాన్ని డిజైన్ చేసింది ఈయనే

చంద్రకాంత్ సోమ్ పుర(77). ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయం తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఇది. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి నేడు(ఆగస్టు 5,2020) భూమి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరనుంది. అయోధ్యలో భారీ స్థాయిలో రామ మందిరాన్ని నిర్మించనున్నారు. కాగా, రామాలయాన్ని డిజైన్ చేసిన వ్యక్తి పేరు చంద్రకాంత్ సోమ్ పుర. ఆయన ప్రముఖ శిల్పి. 30ఏళ్లుగా ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నారు. చివరికి ఆయన నిరీక్షణ ఫలించింది. ఆయన స్వప్నం సాకారం అయ్యింది.

నాడు సోమ్ నాథ్ ఆలయం, నేడు అయోధ్య రామమందిరం:
”నాకు చాలా గర్వంగా ఉంది. గుజరాత్ లోని సోమ్ నాథ్ టెంపుల్ ని మా తాత డిజైన్ చేశారు. ఇప్పుడు ఆయన తర్వాత నేను. మరో ప్రఖ్యాత మందిరం ఆలయ డిజైన్ లో మా సోమ్ పుర ఫ్యామిలీ భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది” అని చంద్రకాంత్ సోమ్ పుర అన్నారు. నా కుమారులు నిఖిల్(55), ఆశిష్(49), అశుతోష్(28) పనులను పర్యవేక్షిస్తున్నారని, వారితో కలిసి ఫలాలను ఆస్వాదించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రకాంత్ సోమ్ పుర చెప్పారు.

1990లో తొలిసారి రామ మందిరం డిజైన్:
1990లో తొలిసారి రామ మందిరాన్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత అందులో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేశారు. గతంలో రెండు డోమ్స్(గోపురాలు) అనుకున్నారు. ఇప్పుడు 5 గోపురాలతో, శిఖరంతో ఆలయాన్ని నిర్మించనున్నారు. అలాగే మందిరం నిర్మించే స్థలం విస్తీరణం కూడా పెరిగింది. గతంలో 141 స్వ్కేర్ ఫీట్, 15వేల స్వ్కేర్ ఫీట్ అనుకున్నారు. ఇప్పుడు 161 స్వ్కేర్ ఫీట్, 30వేల స్వ్కేర్ ఫీట్ విస్తీరణంలో నిర్మాణం జరగనుంది. మందిర నిర్మాణంలో ఎలాంటి మెటల్(లోహం) వాడటం లేదు. బదులుగా పింక్ శాండ్ స్టోన్(రాతి పలకలు) వాడుతున్నారు. రాజస్తాన్ లోని బన్సీ పహర్ పూర్ నుంచి తెప్పిస్తున్నారు.

నాగర శైలిలో మూడున్నరేళ్లలో మందిర నిర్మాణం పూర్తి:
భారతీయ సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా రామ మందిరం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భారతీయ అధ్యాత్మిక వైభవాన్ని అభివ్యక్తీకరించేలా మందిర నిర్మాణం చేపట్టనున్నారు. మూడున్నరేళ్లలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. నమూనా ఆకృతుల ప్రకారం మొత్తం 5 గుమ్మటాలు(గోపురాలు) ఉంటాయి. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ఉత్తర భారతదేశ నాగర శైలిలో ఆలయ నిర్మాణం ఉండనుంది. ముందుగా అనుకున్న నమూనా కంటే ఆలయం ఎత్తు 20 అడుగులు పెంచినట్లు శిల్పులు తెలిపారు. ఆలయ సముదాయంలో ఒకేసారి లక్ష మంది భక్తులు సమావేశం కావచ్చని చెబుతున్నారు. భారతీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మందిర నిర్మాణం భూమి పూజ కోసం దేశంలోని 2వేల ప్రాంతాల నుంచి మట్టిని, 101 నదుల నుంచి నీటిని తీసుకొచ్చారు.

దేశ విదేశాల్లో 100కు పైగా ఆలయ నమూనాలను డిజైన్ చేశారు:
ప్రముఖ శిల్పి చంద్రకాంత్‌ సోమ్‌పుర మోడ్రన్ ఆర్టిటెక్చర్ చదువుకోలేదు. కానీ అపారమైన జ్ఞానం, అనుభవం ఆయన సొంతం. వాస్తు శాస్త్రం ప్రకారం భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఆలయాలను డిజైన్ చేయడంలో దిట్ట. నాకు తెలిసిన ప్రతి విషయాన్ని నేను నా తాత గారి దగ్గర నుంచి నేర్చుకున్నా అని చంద్రకాంత్ సోమ్ పుర చెబుతారు. 1940లో తన తాతగారు సోమ్ నాథ్ ఆలయ నమూనాను డిజైన్ చేసిన రోజులను చంద్రకాంత్ గుర్తు చేసుకున్నారు. దేశ విదేశాల్లో 100కు పైగా ఆలయ నమూనాలను చంద్రకాంత్ డిజైన్ చేశారు. బనస్ కాంతలోని అంబాజీ ఆలయం, లండన్ లోని స్వామి నారాయణ ఆలయాన్ని డిజైన్ చేసింది చంద్రకాంతే.

దేశంలో నిర్మించ తలపెట్టిన 8 ఆలయాలకు డిజైన్లు:
ప్రస్తుతం దేశంలో నిర్మించ తలపెట్టిన 8 ఆలయాలకు డిజైన్లు రూపొందిస్తున్నారు. శిల్ప శాస్త్రంపై ఆయన 12 పుస్తకాలను రచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సోమ్‌నాథ్‌, అక్షర్‌థామ్‌ లాంటి అనేక పుణ్యక్షేత్రాల ఆకృతులను సోమ్‌పుర కుటుంబమే రూపొందించడం విశేషం. రామ మందిర నమూనాల కోసం తనను 30 ఏళ్ల కిందటే సంప్రదించినట్లు చంద్రకాంత్ సోమ్‌పుర తెలిపారు. అప్పట్లోనే డిజైన్ రూపొందించినట్లు వెల్లడించారు. ఆ ఆకృతిలో ప్రస్తుత శైలికి తగినట్లు కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు.

రామ మందిరం డిజైన్..అప్పుడు, ఇప్పుడు:
విస్తీర్ణం: పాత నమూనా ప్రకారం 14వేల స్వ్కేర్ ఫీట్, కొత్త నమూనా ప్రకారం 30వేల స్వ్కేర్ ఫీట్
గోపురాలు: పాత నమూనాలో 2, కొత్త నమూనాలో 5
మెటీరియల్: పాత నమూనాలో 2లక్షల క్యూబిక్ ఫీట్ శాండ్ స్టోన్, కొత్త నమూనాలో 3లక్షల 50వేల క్యూబిక్ ఫీట్ శాండ్ స్టోన్
ఎత్తు: పాత నమూనాలో 141 స్వ్కేర్ ఫీట్, కొత్త నమూనాలో 161 స్వ్కేర్ ఫీట్
ఆలయ సముదాయంలో సందర్శకుల సంఖ్య: పాత నమూనాలో 30 నుంచి 40వేల మంది, కొత్త నమూనాలో లక్ష మంది భక్తులు సమావేశం కావొచ్చు