డీమార్ట్ కస్టమర్లకు హెచ్చరిక, బ్యాంకు ఖాతా ఖాళీ

డీమార్ట్ కస్టమర్లకు హెచ్చరిక, బ్యాంకు ఖాతా ఖాళీ

warning for dmart customers: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో రూపంలో కొత్త ఎత్తుగడలతో అమాయకులను దోచుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తూనే ఉన్నారు. చాన్స్ చిక్కితే చాలు అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఓ చిన్న లింక్ పంపించి మొత్తం దోచేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను డీమార్డ్ 20ఏళ్ల ఉత్సవాలపై పడింది.

డీమార్ట్ 20వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా అందరికీ ఉచిత బహుమతులు.. అంటూ తాజాగా ఓ లింక్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి మెసేజ్‌ ఇప్పటికే వాట్సాప్‌ గ్రూపు ద్వారానో లేదా వ్యక్తిగతంగానో మీకూ వచ్చే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ లింక్‌పై క్లిక్ చేయకండి. ఎందుకంటే ఆ లింక్‌ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ క్రిమినల్స్ పాలయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు.

డీమార్ట్‌ 20ఏళ్ల ఉత్సవాల పేరుతో వీల్‌ తిప్పితే బహుమతులు అంటూ స్పిన్‌వీల్‌తో కూడిన లింక్‌ను పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అది క్లిక్‌ చేయగానే గిఫ్ట్‌ అంటూ మరో లింక్‌ వస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందని సైబర్ నిపుణులు హెచ్చరించారు.

అలానే ఈ నకిలీ ఆఫర్‌పై డీమార్ట్‌ సంస్థ కూడా స్పందించింది. ‘‘ప్రియమైన వినియోగదారులారా… సోషల్ మీడియాలో వస్తున్నట్లు మేం ఎలాంటి గిఫ్ట్‌ వోచర్లు, కూపన్లు ఇవ్వడం లేదు. వినియోగదారులు ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలి’’ అని తెలిపింది.

గతంలోనూ డీమార్ట్ రూ.2,500 గిఫ్ట్‌ వోచర్ పేరుతో నకిలీ మెసేజ్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. అప్పట్లో దీనిపై సంస్థ వివరణ ఇచ్చింది. ఇలా ఆఫర్‌ పేరుతో ఇతరుల నుంచి వచ్చే సందేశాల్లో ఉండే లింక్‌లపై క్లిక్ చేయకపోవడమే మంచిదంటున్నారు సైబర్‌ నిపుణులు. అలానే వాటిని ఇతరులకు పంపకపోవడం వల్ల మరికొంత మందిని సైబర్‌ మోసాల బారిన పడకుండా కాపాడినట్లు అవుతుందంటున్నారు.

సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతాల వివరాలు, కేవైసీ అప్‌డేషన్‌, ఏటీఎం కార్డు అప్‌డేట్‌ పేరిట వచ్చే ఫోన్‌కాల్స్‌ను పట్టించుకోవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఊరికే ఏదీ రాదు. అత్యాశకు పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ తర్వాత ఎంత చింతించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని సైబర్ నిపుణులు అంటున్నారు. మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష అనే విషయం తెలుసుకోవాలని సూచిస్తున్నారు.