GST నష్టపరిహారం చెల్లింపులో జాప్యం..నిర్మలాని కలిసిన పలు రాష్ట్రాల మంత్రులు

  • Published By: venkaiahnaidu ,Published On : December 4, 2019 / 02:59 PM IST
GST నష్టపరిహారం చెల్లింపులో జాప్యం..నిర్మలాని కలిసిన పలు రాష్ట్రాల మంత్రులు

GST నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేశారు. ఢిల్లీ, పంజాబ్, పుదుచ్చేరి, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పాటుగా కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు ఆర్థికమంత్రితో సమావేశమైవారిలో ఉన్నారు.

నిర్మలా సీతారామన్ తో సమావేశం అనంతరం పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన జీఎస్‌టీ నష్టపరిహారాన్ని ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. అక్టోబరు, నవంబరు నెలలకు విడుదల చేయవలసిన నిధులు కూడా చెల్లించలేదన్నారు. ఈ నిధుల కోసం పదే పదే ఢిల్లీ రావడం ఇబ్బందిగా ఉందన్నారు. ఈ నిదులను సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారని చెప్పారు.

జీఎస్‌టీ నష్టపరిహారం చట్టం, 2017 నిబంధనల ప్రకారం… జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. ఐదేళ్ళపాటు రెండు నెలలకు ఒకసారి ఈ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది.