Union Ministers : విపక్షాలకు కేంద్రం కౌంటర్..బిల్లుల విషయంలో బెదిరించారు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే ముగియడానికి విపక్షాలే కారణమని కేంద్రప్రభుత్వం తెలిపింది.

Union Ministers : విపక్షాలకు కేంద్రం కౌంటర్..బిల్లుల విషయంలో బెదిరించారు

Ministers

Union Ministers పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే ముగియడానికి విపక్షాలే కారణమని కేంద్రప్రభుత్వం తెలిపింది. పార్లమెంట్ లో అంతరాయం కలిగించినందుకు మరియు భయపెట్టే విధంగా వ్యవహరించినందుకు విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్రం తెలిపింది. బుధవారం పార్లమెంట్ లో మహిళా ఎంపీలతో పాటు ఇతర ప్రతిపక్ష సభ్యులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బందిని కాకుండా బయట వ్యక్తులను పిలిచారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. బయటి వ్యక్తులు పార్లమెంట్ భద్రతలో భాగం కాదని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 30 మార్షల్స్(.18 మంది పురుషులు, 12 మంది మహిళలు)ఉన్నారని..బయటి నుంచి ఎవరినీ సభలోనికి తీసుకురాలేదని తెలిపింది.

విపక్షాల విమర్శలకు కౌంటర్ గా గురువారం ఏడుగురు కేంద్రమంత్రులు మీడియాతో మాట్లాడారు. పార్ల‌మెంట్‌లో త‌మ స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తాల‌ని ప్ర‌జ‌లు ఎదురు చూస్తార‌ని, కానీ విప‌క్షాలు అరాచ‌కాన్ని సృష్టించాయ‌ని, వాళ్లు ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోలేద‌ని, ప‌న్నుదారుడి సొమ్ము వృధా అయ్యింద‌ని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. బుధవారం రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఖండిస్తున్నామ‌న్నారు. విప‌క్షాలు మొస‌లి క‌న్నీళ్లు ఆపేసి విప‌క్షాలు దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. బిల్లులు పాస‌వుతున్న తీరును విప‌క్షాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయ‌న్నారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ… ఓబీసీ,ఇన్స్యూరెన్స్ బిల్లుల ఆమోదం తర్వాత ప్రభుత్వం మరిన్ని బిల్లులు ఆమోదించడానికి ప్రయత్నిస్తే పార్లమెంట్ లో మరింత తీవ్రమైన నష్టం జరుగుతుందని విపక్షాలు బెదిరించాయని ఆరోపించారు. ఇందువల్లే వర్షాకాల సెషన్‌ను ముందుగానే ముగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రాజ్య‌స‌భ‌లో బుధ‌వారం నాడు కొంద‌రు ఎంపీలు టేబుళ్లు ఎక్కార‌ని, వాళ్ల‌కు వాళ్లు గ‌ర్వంగా ఫీల‌వుతున్నార‌ని, ఏదో ఘ‌న‌కార్యం చేసిన‌ట్లు వాళ్లు భావిస్తున్నార‌ని, స‌భ‌లో జ‌రిగిన దాన్ని షూట్ కూడా చేశార‌ని, పార్ల‌మెంట్‌లో వీడియో షూటింగ్ కు అనుమ‌తి లేద‌ని మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు.

బుధవారం రాజ్యసభలో విప‌క్షాల ప్ర‌వ‌ర్త‌నా తీరు హేయంగా ఉందని మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. విపక్ష సభ్యులు ఫ‌ర్నీచ‌ర్‌, డోర్ల‌ను ధ్వంసం చేశార‌ని, మంత్రుల చేతుల నుంచి పేప‌ర్లు లాగేశార‌ని, మార్ష‌ల్స్‌పై తిర‌గ‌బ‌డ్డార‌ని, డెస్క్‌లు, చైర్ల‌ను ధ్వంసం చేశార‌ని, ఇది అనుచిత ప్ర‌వ‌ర్త‌న అని, వాళ్ల చ‌ర్య‌లు సిగ్గుచేటుగా ఉన్న‌ట్లు గోయ‌ల్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని గోయల్ అన్నారు. అటువంటి హానికరమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోయల్ కోరారు. దర్యాప్తులో కనుగొన్న వాటిని దేశ ప్రజలు చూడడానికి బహిరంగపరచాలని గోయల్ అన్నారు.

READ : Rajya Sabha : రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను బయటపెట్టిన కేంద్రం