Mamata Banerjee : భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి మమత నామినేషన్

పశ్చిమబెంగాల్‌ లో భవానీపుర్​ అసెంబ్లీ స్థానానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నామినేషన్​ వేశారు.

Mamata Banerjee : భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి మమత నామినేషన్

Mamata

Mamata Banerjee పశ్చిమబెంగాల్‌ లో భవానీపుర్​ అసెంబ్లీ స్థానానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నామినేషన్​ వేశారు. కోల్​కతాలోని సర్వే బిల్డింగ్​కు వెళ్లిన మమత నామపత్రాల సమర్పణ ప్రక్రియ పూర్తిచేశారు.

కాగా, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయిన విషయం తెలిసిందే. బీబేపీ నేత సువేందు అధికారిని ఓడించడానికి నందిగ్రామ్‌ నుంచి మమత పోటీచేశారు. అయితే గట్టిపోటీనిచ్చిన ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయాన్ని నమోదుచేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఏ సభకూ(శాసనసభ లేదా శాసనమండలి)ఎన్నిక కాకుండానే మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టారు.

దీంతో మమత.. ఆరు నెలల్లోగా శాసనసభ లేదా లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బెంగాల్ లో శాసనమండలి లేదు. ఈ నేపథ్యంలో భవానీపూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర వ్యవ‌సాయ మంత్రి సోబ‌న్‌దేవ్ చ‌టోపాధ్యాయ్.. మ‌మ‌త కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భవానీపూర్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ గత శనివారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్​ 3న ఫలితం ప్రకటించనున్నారు.

మరోవైపు,ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. మమతా బెనర్జీపై బీజేపీ తరఫున న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్ పోటీపడనున్నారు. కాంగ్రెస్​.. పోటీకి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది.

41 ఏళ్ల ప్రియాంక తిబ్రీవాల్ కోల్‌కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింస కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2014లో ఎంపీ బాబుల్‌ సుప్రియో నేతృత్వంలో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు
. . .