ప‌శ్చిమ బెంగాల్ తొలి ద‌శ ఎన్నిక‌ల్లో కాల్పులు..భ‌ద్ర‌తా సిబ్బందికి తీవ్ర గాయాలు

ప‌శ్చిమ బెంగాల్ తొలి ద‌శ ఎన్నిక‌ల్లో కాల్పులు..భ‌ద్ర‌తా సిబ్బందికి తీవ్ర గాయాలు

West Bengal Election 2 On Poll Duty Injured In Firing

West Bengal election: 2 on poll duty injured in firing : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయమే ప్రారంభమైన నేపథ్యంలో ప‌లు చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా పుర్బా మేదినిపూర్ జిల్లాలోని స‌త్సాతామ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కొంద‌మంది కాల్పులకు పాల్ప‌డ‌డ్డారు. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బందికి తీవ్ర గాయాల‌య్యాయి. వారిని వెంటనే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

 

ఈ కాల్పుల ఘటనపై బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ నేతలు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధాలు..విమర్శనాస్త్రాలు సంధించిన క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ లో కూడా ఈ కాల్పుల ఘటనపై ఇరు పార్టీలు ఒకరిపై మరొరకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓట‌ర్ల‌ను భ‌య‌పెట్టేందుకు బీజేపీ కార్య‌క‌ర్త‌లే కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని టీఎంసీ నేత‌లు అంటుంటే..కాదు కాదు టీఎంసీ నేత‌లు కావాలని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. తృణముల్ కాంగ్రెస్ నేతలు కావాలనే అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని బీజేపీ నేత అనూప్ చ‌క్ర‌వ‌ర్తి ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని ఆరోపించారు.

మరోపక్క బీజేపీ నేతలు, కార్యకర్తలు ఓటింగ్ ప్రక్రియకు అంతరాయంకలిగిస్తూ..నియోజకవర్గాల్లో 178వ పోలింగ్ బూతుల్లోకి ప్రవేశించి గలాటా సృష్టిస్తున్నారని టీఎంసీ ఆరోపిస్తోంది. కోంటై నియోజ‌క‌వ‌ర్గంలోని 149వ నంబ‌ర్ పోలింగ్ కేంద్రం వ‌ద్ద టీఎంసీ శ్రేణులు అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని బీజేపీ ‌నేత సువేందు అధికారి సోద‌రుడు సౌమెందు అధికారి ఆరోపణ‌లు చేశారు.

బీజేపీకి మ‌ద్ద‌తు తెలుపుతోన్న ఓట‌ర్ల‌ను పోలింగ్ బూత్‌లోకి వెళ్ల‌కుండా టీఎంసీ శ్రేణులు అడ్డుకుంటున్నాయ‌ని అన్నారు. ఓట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నార‌ని చెప్పారు. పోలింగ్‌ను అధికారులు స‌జావుగా సాగేలా చూడాల‌ని కోరారు. దీనిపై తాము ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిశామ‌ని, ప‌లు విష‌యాల‌ను తెలిపామ‌ని ఆయ‌న అన్నారు.