PK STrategy In congress: పార్టీ మీది..స్ట్రాటజీ నాది అంటున్న PK..అందుకే కాంగ్రెస్ కు అండగా ఉంటున్నానంటున్న రాజకీయ చాణుక్యుడు

పార్టీ మీది..స్ట్రాటజీ నాది అంటున్న పీకే..అందుకే హస్తానికి అండగా ఉంటున్నా అంటున్నాడీ రాజకీయ చాణుక్యుడు. మరి ఈ వ్యూహకర్త అసలు ప్లాన్ ఏంటీ?

PK STrategy In congress: పార్టీ మీది..స్ట్రాటజీ నాది అంటున్న PK..అందుకే కాంగ్రెస్ కు అండగా ఉంటున్నానంటున్న రాజకీయ చాణుక్యుడు

Prashant Kishore To Join The Congress Party (1)

PK STrategy In congress: మాట్లాడుకున్నంత ఈజీగా స్ట్రాటజీలు వర్కవుట్‌ అవుతాయా? హస్త రేఖలు మార్చడం అంత సులువా? పీకేకి కాంగ్రెస్‌పై అంత ప్రేమెందుకు పుట్టుకొచ్చింది? అంటే అందుకే అంటున్నాడీ రాజకీయ అపర చాణుక్యుడుగా పేరొందిని ప్రశాంత్ కిషోర్. ముద్దుగా పీకే అని పిలుచుకునే ఈ రాజకీయ వ్యూహకర్త మునిగిపోతున్న పడవలాంటి కాంగ్రెస్ లో ఎందుకు చేరాలనుకుంటున్నాడంటే..

కాంగ్రెస్‌ నుంచి నేనేం ఆశించట్లేదు.. నాకు ఎలాంటి పదవొద్దు.. పార్టీకి ఊపిరి పోయడమే నా లక్ష్యం.. అందుకే హస్తానికి అండగా ఉంటున్నా అంటున్నాడు ప్రశాంత్‌ కిశోర్‌. ఎలాంటి ఆశలు లేకుండా పీకే ముందుకు రావడానికి కారణాలేంటన్న సంగతి పక్కనపెడితే.. నీ వ్యూహాలతో మా పార్టీకి ఊపిరిలూదంటూ కాంగ్రెస్‌ అడగలేదు. ఎంతోమందిని అధికారంలోకి తీసుకొచ్చిన నువ్వే.. మాక్కూడా వ్యూహకర్తగా పనిచేయాలంటూ దేబిరించలేదు. ప్రశాంత్‌ కిశోరే స్వయంగా గాంధీలకు ప్రపోజల్‌ పెట్టాడు. మీతో కలిసి పనిచేస్తానంటూ ముందుకొచ్చాడు. ఆ పార్టీలో చేరేందుకు కూడా రెడీ అవుతున్నాడు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు.. కాంగ్రెస్‌ పార్టీకి అత్యవసరంగా ఆయువు పోయాల్సిన అవసరం ఆయనకు ఎందుకొచ్చింది? తన రాజకీయ భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీని సోపానాలుగా వాడుకుంటున్నాడా? అదే నిజమైతే.. పీకే కోరుకుంటున్న ఫ్యూచర్‌ ఏంటి?

Also read : PK STrategy In congress : పాతాళంలోకి పడిపోతున్న కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న PK స్ట్రాటజీ అదేనా?

ప్రశాంత్‌ కిశోర్‌ వృత్తిపరంగా పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌. కేంద్రంలో బీజేపీ సహా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మధ్యలో జేడీయూలో చేరినప్పటికీ.. సీఏఏ విషయంలో నితీష్‌కుమార్‌తో విభేదించి రెండేళ్ల క్రితం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశాడు. అప్పట్నుంచి కేంద్రంలో బీజేపీని, మోదీని గద్దె దించడమే తన లక్ష్యమంటూ వ్యూహాలు రచిస్తున్నాడు. ఆ క్రమంలో బెంగాల్‌లో మమత, తమిళనాడులో స్టాలిన్‌తో కలిసి పనిచేశాడు. ఏపీలో వైసీపీకి ఎప్పట్నుంచో వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ బంపర్‌ మెజారిటీతో అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేశాడు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌కు పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ పీకేనే. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌తోనూ ఒప్పందం చేసుకున్నాడు. 2024 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించేందుకు రంగంలోకి దిగాడు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించడంతో పాటు ఇతర వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువాను అధికారికంగా కప్పుకుంటే.. ప్రాంతీయ పార్టీలు ఆయన్ను దగ్గరకు రానిస్తాయా అన్నది ప్రశ్నార్థకం.

Also read : Congress party: పీకేకు కాంగ్రెస్‌లో ఏ పదవి ఇవ్వబోతున్నారు? సీనియర్ల కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది?

తమిళనాడులో స్టాలిన్‌తో కాంగ్రెస్‌కు పొత్తుంది. మహారాష్ట్రలో శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ థాక్రే కాంగ్రెస్‌ పొత్తుతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ కూడా కాంగ్రెస్‌కు మిత్రుడే. కానీ.. ఇతర రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీల సంగతేంటి? పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ పాతాళంలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ అంటే అంతెత్తున లేస్తుంటారు మమతా బెనర్జీ. ఇక ఏపీలో కాంగ్రెస్‌ సమాధిలో పడుకున్నా సరే.. ఆ పార్టీ పొడ అంటేనే గిట్టదు వైఎస్‌ జగన్‌కు. తెలంగాణలోనూ అదే సిచ్యుయేషన్‌. కాంగ్రెస్‌, బీజేపీలు లేని ఫెడరల్‌ ఫ్రంట్‌ నెలకొల్పేందుకు కేసీఆర్‌ బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మమత, కేసీఆర్‌, జగన్‌ లాంటి బలమైన నాయకుల మద్దతు లేకుండానే.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా? అలా చేయడానికి ప్రశాంత్‌ కిశోర్‌ దగ్గర మంత్రదండం ఏదైనా ఉందా? కాంగ్రెస్‌ పార్టీకి ఆయువు పోయడమే కాదు.. యూపీఏని బలోపేతం చేయడమే పీకేకి అసల్‌ టాస్క్‌. కానీ, ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా యూపీఏ అధికారంలోకి రావడం అసాధ్యం. మరి.. ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతల్ని ఒప్పించేందుకు పీకే దగ్గరున్న వ్యూహాలేంటి? బీజేపీ వ్యతిరేకతను బూచిగా చూపించి.. రీజినల్‌ పార్టీలతో కాంగ్రెస్‌కు ముడి వేస్తారా? కాంగ్రెస్‌ అంటేనే ఒంటి కాలిపై లేచే నాయకుల్ని ఒప్పించడానికే పీకేని గాంధీ కుటుంబం నెత్తిన పెట్టుకుంటోందా? కాకలు తీరిన వ్యూహకర్త అయిన పీకేకు ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారా? ఎలాంటి స్వార్థం లేకుండా.. కేవలం కాంగ్రెస్‌కు ఊపిరులూదడానికే ఆయన పనిచేస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.

Also read : Bulldozrr politics : దేశాన్ని భయపెడుతున్న బుల్డోజర్ రాజకీయాలు..యూపీలో మొదలై హస్తినకు అరాచకాలు

ప్రశాంత్‌ కిశోర్‌ దగ్గర తిరుగులేని వ్యూహాలున్నాయి. అది చాలా రాష్ట్రాల్లో రుజువైంది. రకరకాల డ్రామాలతో నాయకులపై ప్రజల్లో సానుభూతి తీసుకొచ్చి.. అధికారం అందిస్తాడని విమర్శలున్నా.. అవీ ఎవరికీ పట్టవు. ఇదే స్టైల్‌లో 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీకి కూడా బ్లూప్రింట్‌ తయారు చేసిన పీకే.. తన వ్యూహాల్ని గాంధీలకు వివరించాడు. దేశ జనాభా ఎంత.. అందులో ఎంతమంది మహిళలు, యువత ఉన్నారో.. చిన్నచిన్న వ్యాపారస్తులు, రైతులున్నారో లెక్కలతో సహా ప్రవస్తావించాడు పీకే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో దాదాపు 13కోట్ల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరిని కూడా అట్రాక్ట్‌ చేసేలా పీకే ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌కు లోక్‌సభ, రాజ్యసభలో కలిపి 90మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. దేశవ్యాప్తంగా 800మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. మూడు చోట్ల మిత్రపక్షాలతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. మరో 13 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇలా.. లెక్కలన్నీ సేకరించి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ముందుంచాడు. అంతేకాకుండా 1984 నుంచి కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఎలా క్షీణిస్తూ వస్తుందో వివరించాడు. అంటే కాంగ్రెస్‌కు ఆయువు పోయాలన్న పట్టుదలతో ప్రశాంత్‌ కిశోర్‌ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి.. ఆయన వ్యూహాలకు సోనియా గాంధీ స్టాంప్‌ వేస్తారా.. కాంగ్రెస్‌ను నడిపించే బాధ్యతను అప్పగిస్తారా అన్నదే ఇప్పుడు హస్తం భవిష్యత్తును డిసైడ్ చేయనుంది.