పాంగోంగ్ సరస్సు ప్రాధాన్యం ఏంటి? రెచ్చగొట్టడం వెనుక చైనా వ్యూహం ఏంటి…?

  • Published By: sreehari ,Published On : September 2, 2020 / 09:04 PM IST
పాంగోంగ్ సరస్సు ప్రాధాన్యం ఏంటి? రెచ్చగొట్టడం వెనుక చైనా వ్యూహం ఏంటి…?

ఇండియా, చైనా సహద్దులకు సంబంధించి పాంగోంగ్ సరస్సు ప్రాధాన్యం ఏమిటి? సరస్సు ఉత్తరం ఒడ్డుకు, దక్షిణం ఒడ్డుకు మధ్య ఉన్న తేడా ఏమిటి ? ఇంతకాలంగా సరస్సు ఉత్తరం ఒడ్డుకు పరిమితమైన ఘర్షణ వాతావరణం ఇప్పుడు దక్షిణం ఒడ్డుకు ఎందుకు వ్యాపించాయి ? రెచ్చగొట్టడం వెనుక చైనా వ్యూహం ఏంటి…??. వాస్తవాధీన రేఖపై భిన్నాభిప్రాయాల కారణంగానే రెండు దేశాల దళాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.



సరస్సు ఉత్తరం ఒడ్డున మే నెలలో రెండు దేశాల సైనిక దళాల మధ్య రెండుసార్లు ఘర్షణలు జరిగాయి . సమస్య ఇంతవరకు రావడానికి అవే కారణం . జూన్ 15న గాల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణలు పరిస్థిని పూర్తిగా మార్చేశాయి .ఆనాటి ఘర్షణల్లో ఇరవై మంది భారత సైనికులు అమరులయ్యారు . ఆ తరువాత చైనా క్షేత్ర స్థాయి పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.

చైనా దళాలు ఫింగర్ ఎనిమిది నుంచి ఫింగర్ నాలుగు వరకు ఆక్రమించాయి .ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో రెండు దేశాల సైనిక దళాలు పెట్రోలింగ్ చేస్తూ ఉండేవి .కానీ ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని ఎవరూ తమ ఆధీనంలోకి తీసుకోలేదు .చైనా ఇప్పుడా పని చేసింది . అంటే… నాలుగో నంబరు ఫింగర్ దాటి ఇండియా సైనిక దళాలు పెట్రోలింగ్ చేయడం సాధ్యం కాదు.



ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు చైనా దళాలు ఆక్రమించాయి. జూన్ 15 నాటి ఘర్షణల తరువాత మిలటరీ
స్థాయిలో చర్చలు జరిగాయి .అప్పుడు మాత్రం ఫింగర్ నాలుగు నుంచి కొద్ది దూరం మాత్రమే చైనా దళాలు వెనక్కి తగ్గాయి. అంతే …ఆ తరువాత ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్లకుండా అక్కడే తిష్ట వేశాయి. జులై మధ్య నుంచి పరిస్థితి యధాతధంగా కొనసాగడంతో చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

పాంగోంగ్ సరస్సు వద్ద ప్రతిష్టంభన ఇప్పటి వరకు ఉత్తరం ఒడ్డుకు పరిమితంగా ఉండేది . సరస్సు దక్షిణ ఒడ్డు లో ఇండియన్ ఆర్మీ బలంగా ఉంది . ఈ ప్రాంతం ఇండియా సైనిక దళాల రాకపోకలకు చాలా అనుకూలంగా ఉంది. ఛుషుల్ , రేజాన్గ్ లా వరకు ఇండియన్ ఆర్మీ రాకపోకలకు ఎలాంటి అడ్డంకి లేదు.



ఉత్తరం ఒడ్డున మాత్రం గడచిన కొన్నేళ్లుగా ఇరు దేశాల పెట్రోలింగ్ దళాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి .నిజానికి సరస్సు దక్షిణ ప్రాంతం రెండు దేశాలకు కూడా వ్యూహాత్మకంగా కీలకమైందే. చైనా చెబుతున్న వాస్తవాధీన రేఖకు దగ్గరలో సరస్సు దక్షిణ వైపున ఛుషుల్ ఉంది.

అక్కడి వరకు మన సైనిక దళాలు స్వేచ్ఛ గా పెట్రోలింగ్ జరుపుతున్నాయి . అదంతా మైదాన ప్రాంతం కావడం కూడా ఇండియా కు కలిసి వచ్చింది . రెండు దేశాల మధ్య మిలిటరీ స్థాయిలో జరిగే చర్చలు ఇండియా వైపున జరిగితే ఇక్కడే జరుగుతాయి . ఎప్పుడూ లేనిది చైనా దళాలు సరస్సు దక్షిణ ఒడ్డున కూడా లోపలి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశాయి . భారత భద్రతా దళాలు మాత్రం వెంటనే స్పందించాయి . చైనా దళాలను అడ్డుకున్నాయి .



చైనా ఎందుకిలా చేస్తోంది ? ఇందుకు విశ్లేషకులు చెప్పేది ఒక్కటే . అది చైనా విధానం . దాన్ని సలామీ స్లైసింగ్ అంటారు . ఆంటే ముక్కలు చేసి ఆక్రమించడం. రెండడులు ముందుకు, ఒకడుగు వెనక్కు వేస్తుంది చైనా . కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ మొత్తం స్వాధీనం చేసుకోవడం . పాంగోంగ్ సరస్సు ఉత్తరం ఒడ్డున ఫింగర్ నాలుగు వరకు వచ్చి తిష్ట వేశారు. ఇప్పుడు దక్షిణం ఒడ్డున మొదలు పెట్టారు . కాకపోతే దక్షిణం ఒడ్డున ఇండియన్ ఆర్మీ కి అనుకూల పరిస్థితుల కారణంగా చైనా దళాల ఆటలు సాగలేదు.