Congress : ఓడినా మారేదేలేదంటున్న కాంగ్రెస్..సంస్కరణలకు సిద్ధం కాని అధిష్టానం..పీకే అందుకే నో చెప్పారా?!

ఓడినా మారేదేలేదంటున్న కాంగ్రెస్..సంస్కరణలకు సిద్ధం కాని అధిష్టానం..పీకే అందుకే నో చెప్పారా?! అంటే అదేననిపిస్తోంది. మారకుంటే మటాషే అంటున్న వైనం.

Congress : ఓడినా మారేదేలేదంటున్న కాంగ్రెస్..సంస్కరణలకు సిద్ధం కాని అధిష్టానం..పీకే అందుకే నో చెప్పారా?!

Congress Change

Congress: కాంగ్రెస్‌ పార్టీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన అనుభవం ఉంది. ఇన్నేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. దేశ రాజకీయాలను కాచి వడబోసింది. పార్టీలో కాకలు తీరిన నేతలకు కొదువేమీ లేదు. కానీ ఇప్పుడు హస్తం అంపశయ్య పైకి చేరింది. ప్రశాంత్‌ కిశోర్ ఎంట్రీతో కాంగ్రెస్‌ తలరాత మారుతుందని అనుకున్నా..చివరి నిమిషంలో అది కూడా బెడిసికొట్టింది. ఇంతకీ కాంగ్రెస్‌ మారడానికి సిద్ధంగా లేదా ? సీనియర్లు మార్పు కోరుకోవడం లేదా ? పీకే చెప్పిన వాస్తవాలు కాంగ్రెస్‌ అధిష్టానానికి రుచించడం లేదా ?

చరిత్ర ఘనం.. నేడు ధైన్యం.. అంతా శూన్యం.. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇలానే ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగి.. అస్థిత్వం కోల్పోయి.. చివరికి అంపశయ్య పైకి చేరింది. కాలం మారే కొద్ది కొన్ని వాస్తవాలను జీర్ణించుకోవాలి. మార్పును ఆహ్వానించాలి. అంతేకానీ మా తాతలు నేతలు తాగారు.. కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు.ఇప్పుడు రాజకీయాలకు మీ చరిత్రలతో పనిలేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు.. అధికారాన్ని ఇస్తే మీరేం చేయగలుగుతారో చెప్పాలి. అంతేకాదు ఇంకా బూజు పట్టిన సిద్ధాంతాలతో, తలపండిపోయిన నేతలతో… బలమైన బీజేపీని ఢీ కొడదామంటే కుదరదు. కనీసం పార్టీలో యువరక్తానికైనా చోటిస్తున్నారా అంటే అదీ లేదు. అసలు కాంగ్రెస్‌ బతకాలా ? లేదంటే భూ స్థాపితం కావాలా ? అన్నది ఆ పార్టీ చేతుల్లోనే ఉంది. వాడెవడో చెబితే మేం వినడం ఏంటి ? ఆ మాత్రం మాకు తెలియదా ? అన్న అహంకారాన్ని పక్కన పెట్టాలి. ప్రశాంత్‌ కిశోర్ చెప్పిన విషయాలు కాంగ్రెస్ సీనియర్లకు తెలిసే ఉండొచ్చు ! కానీ ఆ వాస్తవాలను గుర్తించడంలో.. వాటిని అమలు చేయడంలోనే విఫలం అవుతున్నారు. ఆచరణలో పెట్టడంలో వెనకడుగు వేస్తున్నారు.

Also read : prashant kishor : హస్తానికి కు హ్యాండ్ ఇచ్చిన పీకే..రిలాక్స్ అయిన టీ.కాంగ్రెస్

కాంగ్రెస్‌లోకి పీకే ఎంట్రీ ఇస్తే కొంత వరకు పార్టీ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుందని అంతా భావించారు.నిజానికి కాంగ్రెస్‌లోకి పీకే రావడం ఆ పార్టీలోని చాలా మంది సీనియర్లకు ఇష్టం లేదు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీని బయటి నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా అప్పజెబుతామన్నది చాలా మంది ప్రశ్న. నిన్నకాక మొన్నొచ్చిన వ్యక్తి చెప్పింది మేం వినాలా ? అన్న అహంకార ధోరణి. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రె్‌సలో కీలక పదవి పొంది పార్టీలోని నేతలందరినీ తన నియంత్రణలో తెచ్చుకుంటారని భయపడ్డారు. అలాగే తాను చెప్పినట్లు నడుచుకుంటే పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని, రాజస్థాన్‌లో సీఎం మార్చాలని, రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిని చేయవద్దని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పడం కాంగ్రెస్‌ నేతలకు ఎంతమాత్రం రుచించలేదు. అందులోనూ ఆయన ఒక్కోసారి ఒక్కో పార్టీకి పనిచేసిన వ్యక్తి కావడంతో ఆయన్ను నమ్మడానికి వీల్లేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు పీకే డిమాండ్లను నేరవేర్చేందుకు కూడా కాంగ్రెస్ సుముఖంగా లేకపోవడంతో పీకే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో మరోసారి కాంగ్రెస్‌ మారలేదన్న విషయం.. ఇకపై మారదన్న విషయం కూడా అందరికీ అర్థమైంది.

అసలు కాంగ్రెస్‌ అధిష్టానంతో పీకే జరిపిన చర్చల్లో ఎక్కడ తేడా కొట్టిందన్న సందేహం అందరిలో కలుగుతోంది. పీకే కాంగ్రెస్ లో చేరి కీలక బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న ఊహాగానాలు వచ్చాయి. చివరికి ఇది బెడిసికొట్టింది. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం ఎంపవర్డ్ యాక్షన్ గ్రూపు పేరుతో ఒక కమిటీ వేయగా అందులో చేరాలని సోనియా కోరడంతో పీకే నిరాకరించారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలి ? ఏ విధానం అనుసరించాలో తాను డిసైడ్ చేస్తానని పీకే కుండ బద్ధలు కొట్టారు. అంటే పార్టీలో కీలక బాధ్యతల పైనే గురి పెట్టారు. ఇది కాంగ్రెస్‌కు నచ్చలేదు. అలాగే పీకే చేసిన కీలక సూచనల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తుల అంశం కూడా ఉంది. కేసీఆర్, జగన్, మమతతో పొత్తు చర్చలు నిర్వహించాలని, అప్పుడే బీజేపీని ఓడించగలమని పీకే సూచించారు. ఇలా చేస్తే పార్టీ క్షేత్రస్థాయిలో కోలుకోకుండా ఇంకా పతనం అయిపోతుందన్న కాంగ్రెస్ భయపడింది. అలాగే టీఆర్‌ఎస్‌, వైసీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ లాంటి ప్రత్యర్థి పార్టీలతో పొత్తు వ్యవహారాలు మంచివి కావన్న అభిప్రాయాన్ని దిగ్విజయ్ సింగ్ సహా కొందరు సీనియర్ నేతలు వ్యక్తం చేశారు.

Also read : PM Modi : అసోంలో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం!

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేందుకు పీకేకు చెందిన ఐప్యాక్ ఒప్పందం చేసుకుంది. టీఆర్ఎస్ తో కలసి పీకే పనిచేయడం కూడా కాంగ్రెస్‌కు నచ్చడం లేదు. తప్పుడు సలహాలతో పీకే తన సొంత లాభం చూసుకుంటున్నారన్న ఓ అపోహ కూడా ఉంది. అయితే ప్రియాంకాగాంధీని పార్టీ చీఫ్ గా చేయాలన్నది పీకే అభిమతంగా కనిపిస్తోంది.ఆమెను అధ్యక్షురాలిని చేసి, కీలక బాధ్యతలు తాను తీసుకుంటే వెనుక నుంచి చక్రం తిప్పొచ్చన్నది పీకే వ్యూహంగా కనిపించింది. కానీ ఆలోచనలతో కాంగ్రెస్‌కు ఏకీభవించలేదు. అయితే ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. పీకేను చేర్చుకున్నంత మాత్రాన కాంగ్రెస్‌కి పూర్వ వైభవం వచ్చేస్తుందని కాదు ! పీకే పార్టీలో చేరనంత మాత్రాన పూర్తిగా హస్తం ఉనికి కోల్పోతుందని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మారాల్సిన సమయం వచ్చింది. పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన టైమొచ్చింది. మేం మారేది లేదు. మేమింతే అనుకుని మూస ధోరణిలోనే ముందుకు పోతే… కాంగ్రెస్ ఖతమైపోవడం ఖాయం !