నిర్భయ నుంచి దిశ వరకు..! ఏడేళ్లలో మనం ఎంతవరకు మారాం?

కిరాతకాలకు పాల్పడే నేరస్థులను కఠినంగా శిక్షించడానికి దేశంలో చాలానే చట్టాలున్నాయి. హత్యాచార దోషులను ఉరితీసేలా కోర్టులూ తీర్పునిస్తున్నాయి. ఇక్కడే ఒక సమస్య.

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 09:59 AM IST
నిర్భయ నుంచి దిశ వరకు..! ఏడేళ్లలో మనం ఎంతవరకు మారాం?

కిరాతకాలకు పాల్పడే నేరస్థులను కఠినంగా శిక్షించడానికి దేశంలో చాలానే చట్టాలున్నాయి. హత్యాచార దోషులను ఉరితీసేలా కోర్టులూ తీర్పునిస్తున్నాయి. ఇక్కడే ఒక సమస్య.

కిరాతకాలకు పాల్పడే నేరస్థులను కఠినంగా శిక్షించడానికి దేశంలో చాలానే చట్టాలున్నాయి. హత్యాచార దోషులను ఉరితీసేలా కోర్టులూ తీర్పునిస్తున్నాయి. ఇక్కడే ఒక సమస్య. హత్యా నేరానికి మరణశిక్షను విధిస్తున్నా.. హత్యలు ఆగడం లేదు. అలాగే అత్యాచారాలు కూడా. తాజా నివేదికల సారాంశమూ ఇదే. శిక్షలతోనే అత్యాచారాలను తగ్గించలేం. మరేం చేయాలి?

2012 నాటి పరిస్థితే ఇప్పుడూ దేశంలో కనిపిస్తోంది. దోషులను ఉరితీయండని జనం డిమాండ్ చేస్తుంటే, రాళ్లతో కొట్టి చంపమన్న వ్యాఖ్యలు పార్లమెంటులో వినిపించాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో తక్షణ విచారణకు డిమాండ్, నిరసన ప్రదర్శనలు, సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు. నిర్భయ కేసులో దేశం యావత్తూ స్పందించినట్లే దిశ కేసులోనూ జనంలో ఆగ్రహావేశాలున్నాయి. ఒకపక్క దిశ నిందితులను సత్వరం విచారించి ఉరితీయాలని జనం కోరుతుంటే, మరోపక్క అత్యాచారాలు, హత్యల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దిశను హత్యాచారం చేసినవాళ్లను పట్టుకుని కొట్టి చంపాలని జనం కోపంతో రగిలిపోతుంటే, ఇంకా మరికొన్ని కేసులు నమోదుకావడం ఏంటి?

2012 నాటి నిర్భయ కేసుకు దిశ కేసుకు మధ్య చాలా పోలికలున్నాయి. నేర ప్రవత్తి ఉన్న బస్ డ్రైవర్, అతని అనుచరులు నిర్భయను బలితీసుకుంటే.. లారీ డ్రైవర్, అతని క్లీనర్లకు దిశ బలైయ్యింది. రెండుచోట్లా రాత్రిపూట ఈ ఘాతుకాలకు పాల్పడ్డారు. వీళ్లకు అమ్మాయిలను హత్యాచారం చేయడం ఫన్ అంట. నిర్భయ కేసులో ఒకడు మైనర్. అందుకే అతన్ని విడిచిపెట్టారు. మిగిలిన ముగ్గురికి మరణశిక్ష విధించారు. ప్రధాన దోషి రామ్ సింగ్ జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలినవాళ్ల మరణశిక్షను ఏడేళ్లయినా చేపట్టలేదు. నిర్భయ నిందితులకు మరణశిక్షను విధించిన తర్వాత దేశం మారిందా? మరణశిక్ష అన్నది నిజంగా అమ్మాయిలపై అఘాయిత్యాలను పాల్పడేవాళ్లకో హెచ్చరిక. కాకపోతే క్రిమనల్స్‌కు ఓ ధైర్యం ఉంటుంది. నేరం చేసి ఏదోలా తప్పించుకోవచ్చులే అనుకుంటుంటారు. దిశ కేసులోనూ జరిగింది ఇదే. హత్యాచారం ఆనవాళ్లను తుడిచిపెట్టడానికి నిందితులు ప్రయత్నించారని పోలీసులు అంటున్నారు. చాలా కేసుల్లో లంచాలను ఇచ్చి పోలీసుల నుంచి తప్పించుకోవచ్చులే అని క్రిమినల్స్‌కు ఓ గట్టినమ్మకం.

2012 ఢిల్లీ కేసులో బస్ డ్రైవర్ కు పర్మిట్ లేదు. అత్యాచారానికి ముందు ఆరుసార్లు నేరాలు చేశాడు. అయినా ప్రతిసారీ బైటకొచ్చేశాడు. హైదరాబాద్ కేసులోనూ అంతే. ప్రధాన నిందుతుడు మహ్మద్ ఆరీఫ్ 2017 నుంచి లైసెన్స్ లేకుండానే లారీని నడుపుతున్నాడు. హత్యాచారానికి రెండు రోజులు ముందు దొరికిపోయాడు. అయినా కేసు లేకుండానే బైటకొచ్చేశాడు. ఆ తర్వాతే దారుణానికి తెగబడ్డాడు. ఒకవేళ కేసు కోర్టుకెళ్లినా ఏళ్ల తరబడి విచారణ సాగుతూనే ఉంటుంది. ఏదో ఒక చోట తక్కువ శిక్షతో తప్పించుకోవచ్చని అనుకుంటారు. ప్రస్తుతం వివిధ కోర్టుల్లో 43 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

కేంద్రప్రభుత్వ లెక్కల ప్రకారమే… 8లక్షల కేసులు పదేళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి. ఇక న్యాయం జరిగేదెక్కడ? ఇలా సత్వర న్యాయం అందకపోవడమే క్రిమనల్స్‌కు ధైర్యాన్ని ఇస్తోంది. ఏదైనా దారుణం జరగ్గానే ఆగ్రహావేశాలను చూపించడమే తప్ప సమస్య మూలాలను పరిష్కరిద్దామని ప్రభుత్వాలు ఆలోచించవు. జనం కోరుకుంటున్న కొన్ని కేసుల్లో న్యాయం చేశామన్నట్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలను సంతృప్తి పరుస్తాయి. మిగిలిన కేసుల్లో సాచివేత ధోరణే. ఇదే పెద్ద సమస్య. పోనీ వ్యవస్థను సంస్కరించడం అంత సులువేం కాదు. చాలా ఖర్చు, సమయం. ఒకవేళ ఏ ప్రభుత్వమైనా ప్రయత్నించినా… జనాలకు పెద్దగా పట్టదు. అందుకే ప్రభుత్వాలు ప్రజాకర్షక ధోరణిలోనే నడుస్తున్నాయని అంటారు సామాజిక వేత్తలు.

తమను కదిలించే ఘటనలకు ప్రజలు స్పందిస్తున్నారు. తక్షణ న్యాయాన్ని కోరుకుంటున్నారు. ప్రభుత్వం కనుక వాళ్ల మాట వింటే సంతృప్తి చెందుతున్నారు. ఆ తర్వాత మహిళలపై ఆత్యాచారాలు సాగుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కావాల్సింది కిరాతకుల నుంచి మరో దిశ బలి కాకుండా కాచుకోవడం. ఆ మేరకు వ్యవస్థలను సన్నద్ధం చేయడం. నేరం చేస్తే తప్పించుకోలేం, ఉరికంబం ఎక్కాల్సిందేనని క్రిమినల్స్‌కు తేల్చి చెప్పడం.

Read More : బతికుండగానే : దిశ కేసులో వెలుగులోకి మరో దారుణ నిజం