మహా రాజకీయంలో మహా ట్విస్ట్ : ఉద్దవ్ పై అలిగిన సంజయ్ రౌత్?

  • Published By: venkaiahnaidu ,Published On : December 30, 2019 / 03:43 PM IST
మహా రాజకీయంలో మహా ట్విస్ట్ : ఉద్దవ్ పై అలిగిన సంజయ్ రౌత్?

మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి శివసేన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ హాజరుకాలేదు. ఆయన అధిష్ఠానంపై అలిగినట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఆయన తమ్ముడు, ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు మంత్రివర్గంలో చోటు లభించక పోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి, శివసేనకు మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్తిన సమయంలో సంజయ్ రౌత్ కీలకంగా వ్యవహరించి ఎన్సీపీ-కాంగ్రెస్ లతో శివసేన ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహిచిన విషయం తెలిసిందే.

ఇంతటి కీలక వ్యక్తి ప్రమాణ స్వీకారానికి గైర్హాజర్ కావడంతో మహా రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ విషయం రాజకీయంగా ప్రాధాన్యం వహించడంతో రౌత్ స్పందించారు. తనతో పాటు తన కుటుంబం ఎప్పటికీ శివసేనతోనే ఉంటుందన్నారు. ఠాక్రే కుటుంబానికి తాము అత్యంత విధేయులమని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో మా కుటుంబం కీలక పాత్ర వహించింది అని రౌత్ అన్నారు. అయితే కేబినెట్ విస్తరణ సమయంలో  మీ సోదరుడిని పార్టీ విస్మరించడంతో మీరు కలత చెందుతున్నారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు…ఇది ప్రతి పార్టీలో సమర్థులైన మూడు పార్టీల ప్రభుత్వం. అందువల్ల కోటాలో ఇవ్వబడినది అంగీకరించాలి. ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను. మేము ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు. పార్టీకి సేవ చేయిలని నమ్మేవాళ్లం మేము. నా సోదరుడు సునీల్ ఎప్పుడూ మంత్రిత్వ శాఖను కోరలేదు. కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని సంజయ్ రౌత్ అన్నారు.

ఇవాళ జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు కూడా కేబినెట్ బెర్త్ దక్కింది. ఇక ఎన్సీపీ ముఖ్యుడు అజిత్ పవార్ కి కూడా కెబినెట్ లో స్థానం దక్కింది.త న కేబినెట్ లో ఉద్ధవ్ ముగ్గురు స్వతంత్రులకు కూడా చోటు కల్పించారు. వారిలో రైతు నేత, నాలుగు సార్లు విదర్భ నుంచి స్వతంత్ర శాసనసభ్యుడిగా ఎన్నికైన బచ్చు ఖడు, అహ్మద్ నగర్ నుంచి శంకర్ గడ్డఖ్, కోల్హాపూర్ నుంచి రాజేంద్ర యద్రావకార్ ఉన్నారు. ఈ స్వతంత్రలంతా కలిసి శివసేనకు మద్దతు పలికినవారిలో ఉన్నారు.