మీ బండికి ఫాస్టాగ్ లేదా? ఏమవుతుందో తెలుసా

మీ బండికి ఫాస్టాగ్ లేదా? ఏమవుతుందో తెలుసా

what will happen if fastag is not on vehicle: ఫిబ్రవరి 15.. అంటే నేటి అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్(Fastag) నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇక నుంచి జాతీయ/ రాష్ట్ర రహదారుల టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ లేని వాహనాలకు ప్రత్యేక మార్గం ఉండదు. ఫోర్ వీలర్స్ అన్నీ ఫాస్టాగ్ లైన్లలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీ బండికి ఫాస్టాగ్ లేకుంటే ఏమవుతుంది అనే సందేహం రావొచ్చు. ఫాస్టాగ్ లేకుంటే జేబుకి చిల్లు తప్పదు. అంటే, రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ కారుకు టోల్ ఫీజు రూ.50 ఉంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఆన్ లైన్ లో లేదా టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ కొనుక్కోవచ్చు.

ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని ఆయన సూచించారు. టోల్‌ప్లాజాల దగ్గర ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్‌ తప్పనిసరి గడువు ఫిబ్రవరి 15తో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడువు పొడిగించేదీ లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే రెండు మూడు సార్లు గడువును పొడిగించామన్నారు. ఫాస్టాగ్‌ ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి (16వ తేదీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదివారం(ఫిబ్రవరి 14,2021) ఓ ప్రకటన విడుదల చేసింది. ఫాస్టాగ్‌ లేకపోతే సదరు వాహనాకి నిర్దేశించిన దానికంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నగదు రహిత చెల్లింపు విధానం అమలు గడువును కేంద్రం గడువు పొడిగిస్తూ వస్తోంది. తొలుత 2021 జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత పొడిగించారు. ఏడాదిన్నరగా ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కాగా, ఫాస్టాగ్ లేని వాహనాలను ఓ వరుసలో అనుమతినిస్తున్నారు. ఇక నుంచి ఈ ఒక్క వరుస కూడా నగదు రహితంగా మారుతుంది.