పాక్ షెల్ దాడులు : నరకం చూస్తున్న సరిహద్దు గ్రామాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2019 / 04:43 AM IST
పాక్ షెల్ దాడులు : నరకం చూస్తున్న సరిహద్దు గ్రామాలు

పాకిస్తాన్ ది వ్రకబుద్ధి అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. భారత వింగ్ కమాండర్ ను పాక్ విడిచిపెట్టడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి వచనాలు పలకడం, ఇవన్నీ చూసిన కాశ్మీర్ ప్రజలు ఇక సరిహద్దుల్లో హాయిగా జీవించవచ్చని ఆశపడ్డారు. తాము శాంతి కాముకులం అని ప్రపంచానికి కలరింగ్ ఇచ్చింది పాక్. అయితే పాక్ చెప్పే శాంతి మాటలన్నీ పచ్చి అబద్దాలని తేలిపోయింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే భారత్ తో శాంతి అంటూ నీచ బుద్ధి ప్రదర్శిస్తుంది. సరిహద్దుల్లో నిత్యం మోర్టార్ షెల్ దాడులతో పాక్ సేనలు విరుచుకుపడుతున్నాయి. భారత ఆర్మీ కూడా వీటిని ధీటుగా తిప్పికొడుతుంది.
 ఈ సమయంలో జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. షెల్స్ తగిలి వారి ఇళ్లు ధ్వంసమైపోతున్నాయి. పశువులు చనిపోతున్నాయి. పిల్లలు ప్రశాంతంగా స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి, ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కు మంటూ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక భయంతో గడుపుతున్నారు. ఆర్ ఎస్ పొరా,నౌషెరా,పూంచ్ సెక్టార్లోని అనేక గ్రామాలు అభినందన్ తిరిగి భారత్ కు వచ్చిన మరుసటి రోజు నుంచి నిత్యం పాక్ షెల్ దాడులతో అతలాకుతలమవుతున్నాయి. తాము రోజూ చస్తూ బతుకుతున్నామని, ఇంకా ఎన్నాళ్లు తాము ఈ దాడులను భరిస్తూ బతకాలని, తమ జీవితాలను దుర్భరం చేసిన పాక్ కు ఇప్పటికైనా తగిన బుద్ధి చెప్పాలని సరిహద్దు గ్రామాల ప్రజలు తెలిపారు. పాక్ షెల్స్ ప్రయోగించిన సమయంలో ఆర్మీ పోస్టుల నుంచి అలారం మోగుతుందని, వెంటనే బంకర్లలోకి వెళ్లి దాక్కుంటామని, కొన్నిసార్లు వెళ్లలేక బయటే ఉండిపోయిన సమయంలో తీవ్ర గాయాలపాలవుతున్నట్లు స్థానికులు తెలిపారు.