Covid 19 India : ఇండియా కరోనా ఫ్రీ దేశంగా ఎప్పుడు అవుతుంది? కీలక విషయాలు చెప్పిన డాక్టర్

Covid 19 India : ఇండియా కరోనా ఫ్రీ దేశంగా ఎప్పుడు అవుతుంది? కీలక విషయాలు చెప్పిన డాక్టర్

Covid 19 India

Covid 19 India : కరోనావైరస్ మహమ్మారి దేశం నుంచి పూర్తిగా పోకపోవచ్చని ఐసీఎంఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇన్ ఫ్లూయెంజా లానే కరోనావైరస్ ఎప్పటికీ మనతోనే ఉండిపోతుందని అన్నారు. ఏదైనా జనాభా మధ్యన లేదా ప్రాంతంలో కరోనావైరస్ ఉండిపోతుందన్నారు. కరోనా మహమ్మారి గురించి ఐసీఎంఆర్ సీనియర్ ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ సమిరన్ పండా కీలక విషయాలు చెప్పారు.

”ఒక్కసారి వైరస్ ఎండమిక్ స్టేజ్ వస్తే అప్పుడు ప్రతి ఏటా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోజులకు ఇన్ ఫ్లూయెంజా లానే కరోనావైరస్ ఎండమిక్ స్టేజ్ కి చేరుతుంది. ఫ్లూ, ఇన్ ఫ్లూయెంజాలు వందేళ్ల క్రితం మహమ్మారులు. ఇప్పుడవి ఎండమిక్ అయ్యాయి. అదే విధంగా
ప్రస్తుతం మహమ్మారిగా ఉన్న కరోనావైరస్ రానున్న రోజుల్లో ఎండమిక్ గా మారుతుంది” అని డాక్టర్ సమిరన్ పండా అన్నారు. అదే సమయంలో వృద్ధులు ప్రతి ఏటా ఫ్లూ షాట్స్ తీసుకోవాలని డాక్టర్ పండా సూచించారు.

” ఇన్ ఫ్లూయెంజా వైరస్ మ్యుటేట్ అవుతూనే ఉంటుంది. అయినా భయపడాల్సిన పని లేదు. దానికి అనుగుణంగా వ్యాక్సిన్లలో చిన్న చిన్న మార్పులు జరుగుతుంటాయి” అని డాక్టర్ పండా చెప్పారు.

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ పండా కోరారు. విదేశాల్లోని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే వరకు వేచి చూడకుండా మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు తీసుకోవడం ఉత్తమం అన్నారు. అంతేకాదు
బిడ్డలకు పాలిచ్చే తల్లులు సైతం నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. తద్వారా తల్లిలో తయారయ్యే యాంటీబాడీలు పాలిచ్చే సమయంలో బిడ్డ శరీరంలోకి కూడా చేరతాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు అందరికీ పూర్తిగా సురక్షితమైనవని డాక్టర్ పండా స్పష్టం చేశారు.

మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఫ్రిబవరి నెల చివరిలో మొదలైంది. ఏప్రిల్, మే నెలలో పీక్స్ కి వెళ్లింది. చాలా రోజులు పీక్స్ లోనే ఉంది. రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత సెకండ్ వేవ్ తీవ్రత తగ్గింది. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకునే లోపే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే వార్తలు భయపెడుతున్నాయి.