Prashant Kishor: కాంగ్రెస్‌లోకి పీకే ఎంట్రీ ఎప్పుడు?.. పార్టీలో అసలేం జరుగుతోంది?

మాజీ ఎన్నికల వ్యూహకర్త.. మాజీ జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయి రాజకీయ నేత కానున్నాడా? మళ్ళీ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్నాడా?

Prashant Kishor: కాంగ్రెస్‌లోకి పీకే ఎంట్రీ ఎప్పుడు?.. పార్టీలో అసలేం జరుగుతోంది?

Prashant Kishor

Prashant Kishor: మాజీ ఎన్నికల వ్యూహకర్త.. మాజీ జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయి రాజకీయ నేత కానున్నాడా? మళ్ళీ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్నాడా? కాంగ్రెస్ పార్టీకి కొత్తగా జవసత్వాలు నింపే బాధ్యతను భుజానికి ఎత్తుకోనున్నాడా? అంటే జాతీయ రాజకీయాలలో చాలారోజులుగా అవుననే వినిపిస్తుంది. అయితే.. ఇది ఎప్పుడు అంటే మాత్రం ఎక్కడా స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. ఇప్పటికే పీకేకు కాంగ్రెస్ పార్టీ రెడ్ కార్పెట్ పరిచిందని విశ్లేషణలు సాగాయి.. కానీ, పార్టీలో చేరే దానిపై మాత్రం స్పష్టమైన వైఖరి కనిపించడంలేదు.

పీకే​ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత,​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీని కలిశారు. ఎన్నికల నిర్వహణ విషయానికి సంబంధించి పార్టీలో కీలక పాత్రను చేపట్టడంపై కూడా చర్చించారు. దీంతో త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో పీకే కింగ్ మేకర్ అవుతారని కథనాలొచ్చాయి. కానీ పరిస్థితి చూస్తే పీకేను పార్టీలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ తర్జనభర్జన పడుతున్నట్లుగా కనిపిస్తుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పీకేను పార్టీలోకి తీసుకోవడంపై అంతర్గతంగా సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అయితే, ఆ సీనియర్ నేతలలో కొందరే పీకే రకాలను వ్యతిరేకిస్తున్నట్లుగా వినిపిస్తుంది.

గత ఏడాది కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖరాసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ లేఖ రాసిన పెద్దలలోని కొందరే ఇప్పుడు పీకే రాకపై అసంతృప్తిలో ఉన్నట్లుగా ఢిల్లీ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే, పార్టీలో కొందరు నేతలు పీకే రాకను, ఆవశ్యకతను గుర్తించి ఆయన్ను ఆహ్వానించాల్సిందేనని బలంగా తమ వాయిస్ వినిపిస్తున్నట్లు తెలుస్తుండగా.. ప్రస్తుతం సోనియా చర్చల అనంతరం దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు సోనియా తీసుకొనే నిర్ణయం ఆ పార్టీ రూపురేఖలు మార్చే నిర్ణయం అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.