11 వేల మంది కరోనా రోగులు ఎక్కడ ? ఎక్కడున్నారు

  • Published By: madhu ,Published On : July 25, 2020 / 02:42 PM IST
11 వేల మంది కరోనా రోగులు ఎక్కడ ? ఎక్కడున్నారు

ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 11 వేల మంది కరోనా పేషెంట్స్ ఎక్కడున్నారనే దానిపై సమాచారం తెలియకపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంటోంది. కరోనా సోకిన వారు చికిత్స తీసుకోకుండానే..పారిపోతూ..ఇతరులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు.

అత్యంత భయంకరమైన పరిణామంలో ఉన్నామని తెలిసి..కూడా కొంతమంది ఈ విధంగా చేస్తుండడం అందర్నీ కలవరపాటుకు గురి చేస్తోంది. బెంగళూరు నగరంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.

కరోనా లక్షణాలున్న వారు పరీక్షలకు వచ్చారు. పరీక్షలు చేయించుకున్న అనంతరం బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలికే(బీబీఎంపీ) సిబ్బందికి అందుబాటులో లేకుండా పోతున్నారంట. ఇలా వారి సంఖ్య ఏకంగా 11 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీళ్లందరికీ కరోనా పాజిటివ్ అని ఉందని తెలుస్తోంది.

కొంతమందిని సంప్రదిస్తే..వారి ఫోన్లు స్విచాప్ ఉండడం, మరికొందరు తప్పుడు నంబర్లు ఉన్నాయి. ఇంకొందరు తప్పుడు అడ్రస్ లు నమోదు చేశారు. వీరికి టెస్టులు చేసిన అనంతరం ఈ విషయాలు తేలిశాయని బీబీఎంపీ వర్గాలు ప్రకటించాయి.

బెంగళూరులో రోజువారీగా కరోనా కేసులు అధికమౌతున్నాయి. రోజుకు 1500 స్థాయిలో కేసులు రికార్డవుతున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు వచ్చిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీబీఎంసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని వస్తే..తమను ఎక్కడ ఆసుపత్రిలో ఉంచుతారనే భయం వారిలో నెలకొందంటున్నారు.

ఇతర భయాలతో తప్పుడు సమాచారం ఇస్తున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ వారికి కరోనా పాజిటివ్ వస్తే..ఎలా ? వారు ఎక్కడెక్కడ తిరిగారు ? తదితర సమాచారం సేకరించాలంటే చాల కష్టమతరమవుతుందన్నారు. ఇంకెంత మందికి వైరస్ అంటిస్తారోమోనన్న భయం అందరిలో నెలకొంది.