నాడు MLAగా ఓటమి…నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

  • Published By: venkaiahnaidu ,Published On : January 20, 2020 / 11:37 AM IST
నాడు MLAగా ఓటమి…నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

భారతీయ జనతా పార్టీ(BJP)కొత్త రథసారథిగా ఇవాళ(జనవరి-20,2020)జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏడు నెలల తర్వాత నడ్డా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. 2014 జులై నుంచి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అమిత్ షా నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి రికార్డు మెజార్టీతో లోక్ సభలో అడుగుపెట్టిన అమిత్ షా మోడీ 2.0మంత్రివర్గంలో హోంశాఖ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నడ్డా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ‘ఒక వ్యక్తి, ఒక పదవి’ సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమిత్ షా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించిన జేపీ నడ్డాను పూర్తిగా పార్టీ వ్యవహారాలకే పరిమితం చేశారు. 75 ఏళ్లు పైబడిన నేతలు విరమణ చేయాలనే నిబంధన మేరకు 2024 ఎన్నికల్లో అమిత్ షా ప్రధాని అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక 59 ఏళ్ల జేపీ నడ్డా…బీజేపీ అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు పాటు సేవలు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచే బీజేపీ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న నడ్డాకు మచ్చలేని నేతగా మంచి పేరుంది. ఈ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా భావించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ జనతా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లగలడన్న నమ్మకంతో ప్రధాని మోడీ ఆయనను ఈ పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం. అమిత్ షా ఆశిస్సులు కూడా మెండుగా ఉన్న నడ్డా మోడీ 1.0మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

అసలు ఎవరీ జేపీ నడ్డా?
బీహార్ రాజధాని పాట్నాలో 1960 డిసెంబర్2న నరైన్ లాల్ నడ్డా,శ్రీమతి కృష్ణా నడ్డా దంపతులకు జగత్ ప్రకాష్ నడ్డా జన్మించారు. పాట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తిచేసిన జేపీ నడ్డా పాట్నా యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. చిన్నతనంలో ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌ కు బీహార్‌ తరపున నడ్డా ప్రాతినిధ్యం వహించాడు. 1978లో ఏబీవీపీ విద్యార్థినాయకుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభించిన నడ్డా 1991-94వరకు నితిన్ గడ్కరీ,అమిత్ షాలతో కూడా పార్టీ యువజన విభాగం భారతీయ యువ మోర్చాలో పనిచేశారు.
 

ప్రత్యక్ష రాజకీయాల్లోకి

ఇక 1993లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నడ్డా అడుగుపెట్టారు.1993లో హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జేపీ నడ్డా 1998లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆరోగ్య,కుటుంబసంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతు చేపట్టారు. ఇక 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నడ్డా 2007 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి సీఎం ప్రేమ్ కుమార్ దుమాల్  తో విభేధాల కారణంగా 2010లో నడ్డా తన మంత్రిపదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

జాతీయ రాజకీయాల్లోకి

ఇక 2010లోనే నితిన్ గడ్కరీ ఆశిస్సులతో జాతీయ రాజకీయాల్లోకి నడ్డా ఎంట్రీ ఇచ్చారు. నడ్డాను 2010మేలో నడ్డాను పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు అప్పటి బీజేపీ ప్రెసిడెంట్ గడ్కరీ. ఇక అప్పటి నుండి నడ్డా జాతీయ స్థాయిలో బీజేపీలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తిరిగి రాష్ట్ర శాసనసభకు వెళ్ళలేదు. బిజెపి జాతీయ రాజకీయ ప్రణాళికలో భాగమైన వెంటనే, నడ్డా 2012 ఏప్రిల్‌లో రాజ్యసభ సభ్యుడయ్యాడు. 2014-19వరకు మోడీ 1.0మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వహించాడు. 

2019 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌ పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకొని ఎస్పీ-బీఎస్పీల కలయికను ప్లాప్ చేసి మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 62 సీట్లలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. లోక్ సభ ఎన్నికల అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. 2020 జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. నడ్డాకు ఇద్దరు కుమారులున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే…నడ్డా అత్తగారు మధ్యప్రదేశ్ బీజేపీ సీనియర్ లీడర్ అయిన మాజీ లోక్ సభ ఎంపీ జయశ్రీ బెనర్జీ.