Karnataka: కర్నాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

కర్నాటక రాజకీయాల్లో సుదీర్ఘ గొడవ తరువాత, ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. యెడియరప్ప గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు.

10TV Telugu News

Karnataka: కర్నాటక రాజకీయాల్లో సుదీర్ఘ గొడవ తరువాత, ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. యెడియరప్ప గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ కూడా అంగీకరిండగంతో ఇప్పుడు కర్నాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే విషయమై సస్పెన్స్ కొనసాగుతుంది. 75 ఏళ్లు పైబడినప్పటికీ రెండేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ, అమిత్ షాకు యెడియరప్ప కృతజ్ఞతలు తెలిపారు.

ఈ క్రమంలో నెక్స్ట్ యెడియరప్ప వారసుడు ఎవరు? అనే విషయం ఇప్పుడు కన్నడ రాజకీయాలను కుదిపేస్తుంది.

యడ్యూరప్ప వారసుడు ఎవరు?
కర్నాటకలో సీఎం అయ్యే అవకాశం కోసం ఆశావహుల జాబితా బలంగానే ఉన్నప్పటికీ, యెడియరప్పనే రీప్లేస్ చేయగల సత్తా ఉన్న నాయకుడు రావడం మాత్రం చాలా కష్టమైన పని అని భావస్తోంది కేంద్రం. తగిన ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం పార్టీ ముందు సవాల్ అని బిజెపి కార్యకర్తలే అంటున్నారు. రాష్ట్ర నాయకత్వంలో తరాల మార్పును తీసుకురావాలని, అధికారాన్ని సజావుగా మార్చాలని బీజేపీ భావిస్తోంది. అయితే రాష్ట్రంలో పార్టీకి “వివాదరహిత వ్యక్తి”ని ప్రత్యామ్నాయంగా తీసుకుని రావడం చాలా కష్టమన పని అని కూడా ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్పు చేయాలంటే, బీజేపీ కూడా ఒక రకమైన సమతుల్యతను పాటించాలి. ఎందుకంటే ఈ చర్య వల్ల ఓటు బ్యాంకు ప్రభావితం అవ్వొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. ఆధిపత్య వీరశైవ-లింగాయత్ సమాజానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రభావం పార్టీ మీద గట్టిగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే యెడియరప్ప అదే సామాజిక వర్గం నుంచి వచ్చి గణనీయమైన ప్రభావాన్ని చూపారు.

రాష్ట్ర జనాభాలో సుమారు 16 శాతం మంది లింగాయత్ సమాజం నుంచే ఉన్నారని అంచనా. వీరశైవ-లింగాయత్ సంఘం రాష్ట్రంలో బీజేపీకి బిగ్ సపోర్ట్. యెడియరప్ప తొలగింపుకు వ్యతిరేకంగా ఇప్పటికే గళం వినిపిస్తున్నారు ఆ సామాజిక వర్గం. ఇతర రాష్ట్రాల్లో ప్రయోగాలు చేసినట్లే రాష్ట్రంలో కూడా బీజేపీ ముఖ్యమంత్రి పదవికి ఆశ్చర్యం కలిగించే అభ్యర్థిని పెట్టవచ్చని కూడా అంటున్నారు. యెడియరప్ప వారసుడిగా కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి, మాజీ కేంద్ర మంత్రి డివి సదానంద గౌడ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి మరియు పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. జోషి మరియు సంతోష్ బ్రాహ్మణులు; చిక్కమగలూరు నుండి ఎమ్మెల్యేగా ఉన్న రవి, వోక్కలిగా అనే రాష్ట్రంలోని మరొక ఆధిపత్య సమాజానికి చెందిన వ్యక్తి. ఎక్కువగా దక్షిణ కర్ణాటకలో కేంద్రీకృతమై ఉన్నారు.

అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగెరి కూడా సీఎం రేసులో ఉన్నారు. ఆయన కూడా బ్రాహ్మణులే. రామకృష్ణ హెగ్డే తరువాత 1988నుండి రాష్ట్రంలో బ్రాహ్మణ ముఖ్యమంత్రి లేరు. అయితే, యెడియరప్ప స్థానంలో ఆధిపత్య వీరశైవ-లింగాయత్ వర్గానికి చెందిన మరో నాయకుడిని పార్టీ చూస్తుంటే, మైనింగ్ మంత్రి మురుగేష్ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ కూడా ఉన్నారు. నిరానీ వ్యాపారవేత్త-రాజకీయ నాయకుడు కాగా, బెల్లాడ్ హుబ్లి-ధార్వాడ్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే.

రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుత మంత్రులలో, హోంమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మాయి (లింగాయత్), రెవెన్యూ మంత్రి ఆర్ అశోక, డిప్యూటీ సిఎం సిఎన్ అశ్వత్ నారాయణ్ (వోక్కలిగాస్) పేర్లు కూడా ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్నాయి. ఉత్తర కర్నాటకకు చెందిన మరో లింగాయత్ నాయకుడు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన పరిశ్రమల మంత్రి జగదీష్ శెట్తార్ కూడా పోటీలో ఉండవచ్చు. ఉప ముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్, బీ శ్రీరాములు వంటి దళిత నాయకుల పేర్లు కూడా ముఖ్యమంత్రి పోటీలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

10TV Telugu News