బెంగాల్ ఎన్నికల ప్రచారంలో “కనబడని కాంగ్రెస్ పెద్దలు”..కారణమిదేనా!

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు.

బెంగాల్ ఎన్నికల ప్రచారంలో “కనబడని కాంగ్రెస్ పెద్దలు”..కారణమిదేనా!

Bengal Poll Campaign

BENGAL POLL CAMPAIGN ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు. ఒకవైపు తృణమూల్‌ కాంగ్రెస్ తరపున సీఎం మమతా బెనర్జీ అంతా తానై వ్యవహరిస్తుండటం, మరోవైపు, ఎలాగైనా బెంగాల్ లో గెలిచి తీరాలన్న కసితో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు బీజేపీ జాతీయ నేతలు బంగాల్‌ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్లడం వల్ల అక్కడి రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

అయితే, అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్‌లో.. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ మాత్రం ప్రచారంలో వెనుకబడి ఉంది. బెంగాల్​ ఎన్నికల తొలి దశ పోలింగ్​ ముగిసినప్పటికీ కాంగ్రెస్​ ప్రముఖులు ఇంకా ఆ రాష్ట్రంలో ప్రచారాలు నిర్వహించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీజేపీ నుంచి జాతీయ నేతలు వరుసగా పర్యటనలు చేస్తుంటే…. కాంగ్రెస్‌ కీలక నేతలు అసలు ఆ రాష్ట్రం వైపే చూడడం లేదు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా సహా మరే జాతీయ నేత అక్కడ ప్రచారం ఇంకా ప్రారంభించనే లేదు.

కాగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్యలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతుండగా.. బెంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రదర్శనపై సానుకూల నివేదికలు రానందునే, పార్టీ‌ కీలక నేతలు అక్కడ ప్రచారం నిర్వహించడానికి ఇష్టపడడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు,బెంగాల్‌ రాష్ట్ర నాయకత్వానికి, ఎన్నికల కోసం నియమించిన ఇంఛార్జ్‌ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి అన్ని నిర్ణయాలు.. బెంగాల్ పీసీసీ చీఫ్ అధిర్‌ రంజన్‌ చౌదరి తీసుకుంటున్నారని, ఇన్‌ఛార్జ్‌ జితిన్ ‌ప్రసాదను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై జితిన్‌ ప్రసాద ఆగ్రహంతో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు బెంగాల్‌లో ప్రచారానికి రాకపోవడానికి మరో ప్రధాన కారణం కేరళ అసెంబ్లీ ఎన్నికలుగా తెలుస్తొంది. కేరళలో వామపక్షాల నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తుండగా.. బెంగాల్‌లో వారితోనే కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. అందుకే.. కేరళ ఎన్నికలు పూర్తికాక ముందు బెంగాల్‌లో ప్రచారం నిర్వహించకపోవడమే మేలని.. కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ బెంగాల్‌లో అధికారంలో రావడానికి అంతగా అవకాశాలు లేవు. అదే సమయంలో కేరళలో మాత్రం కాంగ్రెస్‌ కూటమి యూడీఎఫ్​కు గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్‌ హైకమాండ్‌కు, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సత్సంబంధాలే ఉన్నాయి. ఇది కూడా ఓ కారణమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.