Lok Sabha Elections 2024: విపక్షాల సమావేశానికి కేసీఆర్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్ ఎందుకు వెళ్లడం లేదు?

గత లోక్‌సభ ఎన్నికల ముందు విపక్షాలను ఏకం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. చివరకు..

Lok Sabha Elections 2024: విపక్షాల సమావేశానికి కేసీఆర్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్ ఎందుకు వెళ్లడం లేదు?

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: విపక్షాల ఐక్యత కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 2018-2019లో ఎన్నో ప్రయత్నాలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) కూడా బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమి కోసం మొన్నటి వరకు ప్రయత్నించారు. విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ ఓడిపోవడం ఖాయమని చెప్పారు.

ఇక, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి నుంచీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరం పాటిస్తున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు జూన్ 23న బిహార్ (Bihar) రాజధాని పట్నాలో జరగనున్న విపక్షాల సమావేశంలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల వేళ వారు విపక్ష పార్టీల సమావేశానికి దూరంగా ఉండాలని భావిస్తుండడం వెనుక పలు కారణాలు ఉన్నాయి.

జాతీయ రాజకీయాల్లో ఆయా నేతలకు ఉన్న లక్ష్యాలు, రాష్ట్రాల్లో సొంత పార్టీపైనే దృష్టి పెట్టాలన్న ఆలోచనలు, రాజకీయాల్లో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా సురక్షితమైన విధానాలు అవలంబించాలన్న ధ్యేయం వంటివే అందుకు కారణాలని విశ్లేషకులు అంటున్నారు.

చెప్పకనే చెప్పిన ఒడిశా సీఎం
దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశం అయ్యారు. వారు కూటమి గురించే మాట్లాడారని సమాచారం. అయితే, తాము ఏ కూటమి గురించీ తాము చర్చించలేదని నితీశ్ తో పాటు నవీన్ పట్నాయక్ చెప్పారు. దీన్ని బట్టి విపక్షాల కూటమిలో నవీన్ పట్నాయక్ ఎప్పటిలాగే చేరబోరని స్పష్టమవుతోంది. జూన్ 23న జరిగే విపక్షాల సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశాలు లేవు.

చంద్రబాబు వెళ్లరు
గత లోక్‌సభ ఎన్నికల ముందు విపక్షాలను ఏకం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. చివరకు బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడింది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలతో సమావేశమై చర్చలు జరిపారు. ఎన్డీఏలో టీడీపీ మళ్లీ చేరుతుందన్న ప్రచారం జరిగింది. విపక్షాలను ఏకం చేసే విషయంలో ఈ సారి చంద్రబాబు ఎటువంటి ప్రయత్నాలూ చేయడం లేదు. దీంతో విపక్షాల సమావేశానికి ఆయన దూరంగా ఉంటారని తెలుస్తోంది.

కేసీఆర్ వెళ్తారా?
దేశంలోని దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటున్నాయి. విపక్షాల ఐక్యత కోసం కేసీఆర్ కూడా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ విపక్ష పార్టీల సమావేశానికి వెళ్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాల భేటీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. అయితే, కేసీఆర్ తో మాత్రం ఇప్పటివరకు తాము దీనిపై మాట్లాడలేదని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. దీంతో ఈ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

CM KCR-Sharwanand: సీఎం కేసీఆర్‌ను క‌లిసిన హీరో శ‌ర్వానంద్‌.. ముచ్చ‌టేంటంటే..?