దేవాలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి…కుళ్ళిపోతే అపచారమా?…

కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక అంటే మన అహంకారాన్ని వదిలి లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును దేవుని ముందు పరిచామని అర్థం. ఆ కొబ్బరినీరులా మన జీవితం నిర్మలం అవ్వాలని కోరుకుంటారు.

దేవాలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి…కుళ్ళిపోతే అపచారమా?…

Coconut (1)

హిందు ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. భగవంతుడిని కొలిచేందుకు మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతో మంది ఆలయాలకు వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసేది కొబ్బరి కాయ కొట్టడం. కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనక ఉన్న ఆంతర్యం ఎంటి. చాలామందికి తెలియదు. అయినప్పటికీ పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం కాబట్టి కొనసాగిస్తుంటారు కాని అసలు దీనివెనుక కధ ఏంటనేది తెలియదు.

హిందువులు తమ ఇళ్ళలో ప్రతిష్ఠించుకొని కానీ లేక దేవాలయాలలో కానీ తమ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తారు. ప్రవర్తనలు, ఆచారాలు, సమాజాన్ని పరిపాలించే నియమాలు, నీతిని కలిగి ఉంటాయి. అందులో భాగంగా దేవుని వద్ద కొబ్బరికాయ ని కొడతారు. ప్రతి పండుగకి, శుభకార్యానికి కొబ్బరికాయ తప్పకుండా కొడతారు. హిందూ పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజానికి కొబ్బరికాయను మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరి కాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతే కాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగుతాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకే కొబ్బరి కాయను ఆలయంలో కొడతారు.

కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక అంటే మన అహంకారాన్ని వదిలి లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును దేవుని ముందు పరిచామని అర్థం. ఆ కొబ్బరినీరులా మన జీవితం నిర్మలం అవ్వాలని కోరుకుంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. కాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా కొంతమందిని తృప్తి పరుస్తుంది. మరి కొంతమందిని అసంతృప్తి పరుస్తుంది. కాయ సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని భావిస్తారు. నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని భావిస్తారు.

దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కొంత మంది కాయ కుళ్లితే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని ఆందోళనకు చెందుతారు. అయితే అంత ఆందోళన చెందాల్సిన పనిలేదు. సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. మనమనస్సులో ఉండే చెడు స్వభావం తొలగిపోయిందని భావిస్తే మంచి స్వభావం అలవర్చుకునే అవకాశానికి స్పూర్తి అవుతుంది. కొబ్బరికాయ కుళ్ళిపోతే చేతులు కాళ్లు కడుక్కుని పూజలు కొనసాగించాలని పండితులు సూచిస్తుంటారు.