ఎన్డీయే నుంచి శివసేన ఔట్ : కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : November 11, 2019 / 03:20 AM IST
ఎన్డీయే నుంచి శివసేన ఔట్ : కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ రాజీనామా

కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ మోడీ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఎన్టీయేలో భాగస్వామిగా ఇప్పటివరకు ఉన్న శివసేన తరపున కేంద్రమంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ సోమవారం(నవంబర్-11,2019)ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. నిజం శివసేన వైపు ఉందని,ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం ఎందుకని రాజీనామా చేస్తున్నానంటూ అర్వింద్ సావంత్ ట్వీట్ చేశారు. ఇవాళ తాను మీడియాతో మాట్లాడతానని ఆయన తెలిపారు.

ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఆదివారం(నవంబర్-10,2019)బీజేపీ ప్రకటించడంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ ఆహ్వానించారు.

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 105మంది విజయం సాధించగా, శివసేనకు 56మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 44మంది,ఎన్సీపీ 54మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ-శివసేన,ఎన్సీపీ-కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50:50ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోడంతో శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. భుత్వ ఏర్పాటుపై ఎన్సీపీతో శివసేన చర్చలకు రెడీ అయినట్లు సమాచారం. అయితే ఎన్డీయే నుంచి శివసేన పూర్తిగా వైదొలిగితేనే తమ మద్దతు ఉంటుందని ఎన్సీపీ షరతు విధించింది. ఈ కారణంగానే అర్వింద్ సావంత్ మోడీ కేబినెట్ నుంచి తప్పుకున్నట్లు అర్థమవుతోంది.