Fish Curry : లంచ్‌లో చేపల కూర లేదని ట్రాన్ఫార్మర్ ఎక్కిన మొగుడు

Fish Curry : లంచ్‌లో చేపల కూర లేదని ట్రాన్ఫార్మర్ ఎక్కిన మొగుడు

Wife Did Not Cook Fish Curry In Lunch

Fish Curry : సాధారణంగా మొగుడూ పెళ్లాల గొడవలు ఎలా ఉంటాయంటే భార్య ఏదో గొంతెమ్మ కోర్కెలు కోరితే అవి తీర్చటంలో ఆలస్యం అవటం కానీ.. భర్త బయట చెడు తిరుగుళ్లు తిరగటం.. తాగి రావటంతో గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ బీహార్‌లోని పుర్నియాలో ఒక భర్త ఆత్మహత్య చేసుకుంటానని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హంగామా సృష్టించాడు. ఎందుకు ఎక్కావయ్యా అంటే లంచ్‌లో చేపల కూర వండ లేదని భార్యపై కోపంతో ఎక్కాడుట.

వివరాల్లోకి వెళితే బీహార్‌లోని పూర్నియా జిల్లా రూపౌలి పోలీసు స్టేషన్ పరిధిలో బారౌలి ప్రాంతంలో నివసించే సంతోష్‌రామ్ మంగళవారం సాయంత్రం బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. వచ్చీ రాగానే భార్యను అన్నం పెట్టమని అడిగాడు. ఆమె అతడికి అన్నం పెట్టింది. కంచంలో పదార్ధాలు చూసి ఇంక ఆమెతో గొడవ పెట్టుకున్నాడు.

అన్నంలోకి చేపలు కూర కావాలని అడిగాడు. ఆరోజు ఆమె చేపల కూర వండక పోవటంతో… ఇప్పుడు లేదు అని చెప్పింది. అంతే ఇంక సంతోష్‌రామ్ భార్యపై చిందులు వేశాడు. తనకు ఇప్పుడే చేపలకూర కావాలని పంతం పట్టాడు. ఇప్పటికిప్పుడు తీసుకు వచ్చి వండలేనని భార్య తెగేసి చెప్పింది. ఇంట్లో చెయ్యాల్సినంత హంగామా చేసి రోడ్డు మీదకు వచ్చి వీరంగం వేశాడు సంతోష్ రామ్. అంతటితో ఆగకుండా ఇంటి వద్ద ఉన్న కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడు.

నేనంటే అసలు ఇంట్లో ఎవరికీ లెక్కలేదు… ఇంట్లో నాకు విలువ లేదు…నేను ఛస్తేనే మీకు తెలిసొస్తుంది…అంటూ కేకలు వేస్తూ కరెంట్ తీగలు పుచ్చుకున్నాడు. ఈ హంగామా చూసిన స్ధానికులు వచ్చి కిందకు దిగి రమ్మని ఎంత కోరినా వినలేదు. ట్రాన్ఫ్‌ఫార్మర్ మీద కూర్చుని కరెంట్ వైర్లు పట్టుకుని హంగామా సృష్టించాడు.

ఇంతలో పోలీసులు వచ్చి కిందకు దిగమని కోరినా వినలేదు. ఏం జరిగిందని పోలీసులు భార్యను అడగ్గా చేపల కూర విషయం చెప్పింది. దీంతో పోలీసులు తాము చేపల కూర తెప్పిస్తామని చెప్పటంతో కిందకు దిగి వచ్చాడు. 11కేవీ విద్యుత్ ప్రవహించే ఆ లైన్ లో సంతోష్ రామ్ పైకి ఎక్కిన టైమ్ లో విద్యుత్ సరఫరా లేకపోవటంతో బతికిపోయాడు. కిందకు దిగిన సంతోష్‌రామ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.