సుమలతకు బీజేపీ మద్దతు! : మండ్యాలో పొలిటికల్ హీట్

  • Published By: venkaiahnaidu ,Published On : March 15, 2019 / 11:52 AM IST
సుమలతకు బీజేపీ మద్దతు! : మండ్యాలో పొలిటికల్ హీట్

కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.మండ్యా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకుంటున్నట్లు గత నెలలో సుమలత ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్యతో కూడా ఆమె సమావేశమయ్యారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జేడీఎస్ కు కేటాయించారు.సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడను మండ్యా నుంచి బరిలోకి దించాలని జేడీఎస్ భావిస్తుంది.దీంతో కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగాలని ఆమె నిర్ణయించుకున్నారు.
Read Also: PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!

ఈ సమయంలో శుక్రవారం(మార్చి-15,2019) బీజేపీ నేత,మాజీ సీఎం ఎస్ ఎమ్ కృష్ణ సుమలతో సమావేశమయ్యారు. సమావేశమనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆమె ప్రశంసలు కురిపించారు. సుమలత ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత మండ్యా నుంచి బీజేపీ తరపున అభ్యర్థిరని నిలబెట్టాలా లేదా అన్నదానిపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎస్ ఎమ్ క్రిష్ణ తెలిపారు. బీజేపీ నిర్ణయాన్ని మార్చి-18న తాను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు మండ్యా నియోజకవర్గంలో సుమలత,నిఖిల్ వర్గాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె…నియోజకవర్గంలోని మాలవల్లి ప్రాంతంలో ఇటీవల ప్రచారం కూడా నిర్వహించారు. అంబరీష్‌ అభిమానులు 4వేల మంది బైక్‌ ర్యాలీ చేశారు. పోటీగా మరుసటి రోజు ఇదే ప్రాంతంలో నిఖిల్‌ గౌడ ప్రచారం చేశారు.అంబరీష్‌ వర్గీయులు కుమారస్వామి వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. ‘నిఖిల్‌ గో బ్యాక్‌’ అంటూ పోస్టర్లు పెడుతున్నారు. నిఖిల్‌ వర్గీయులు ‘మన జిల్లా, మన మండ్య’ అంటూ స్థానిక సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారు.

అంబరీష్‌ మరణించిన నెల రోజులైనా కాకముందే ఆమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారంటూ సీఎం కుమారస్వామి అన్న,కర్ణాటక మంత్రి హెచ్ డీ రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను ప్రత్యర్థులతోపాటు కొందరు సొంత పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు పోటీ నుంచి తప్పుకునేలా సుమలతను ఒప్పించేందుకు కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

అంబరీష్‌ అభిమానులతోపాటు కన్నడ సినీ ప్రముఖులు దర్శన్‌, సుదీప్‌, చరణ్‌రాజు సుమలతకు మద్దతు ప్రకటించారు. సుమలత తరఫున ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా సుమలతకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
Read Also: వివేకా హత్య : ఆరోపణలు రుజువైతే నడిరోడ్డు పై కాల్చేయండి