ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ..కన్యాకుమారి నుంచి పోటీ!

ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ..కన్యాకుమారి నుంచి పోటీ!

Priyanka-Gandhi

Priyanka Gandhi కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం వాదిస్తున్నారు. ఏప్రిల్ 6న తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపడానికి ప్రియాంక గాంధీ..అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజే జరిగే కన్యాకుమారి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు.

కాంగ్రెస్ నేత, కన్యాకుమారి సిట్టింగ్ ఎంపీ వసంత కుమార్ కొద్ది నెలల క్రితం కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కార్తి చిదంబరం కోరారు. ఈ మేరకు ఆమెను అభ్యర్థిగా ప్రకటించాలని తాను రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి వినతిపత్రం సమర్పించానని శుక్రవారం కార్తి చిదంబరం తెలిపారు. ఆయన ఈ డిమాండ్ చేయడం ఇది రెండోసారి. గత ఏడాది నవంబరులో కూడా కార్తి చిదంబరం ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో ఇటీవల ప్రచార శంఖారాన్ని పూరించిన ప్రియాంకగాంధీ..స్థానికులతో మమేకమవుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అసోంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆమె చెమటోడుస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అసోంలో గత ఎన్నికలు హస్తం పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దెదించి భాజపా అక్కడ కాషాయ జెండా ఎగురవేసింది. ఈ సారి అసోం ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే కీలక నేత, మాజీ సీఎం తరుణ్‌ గొగొయి మరణం కాంగ్రెస్‌కు లోటు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను ప్రియాంక గాంధీ తీసుకున్నారు.