2024 ఎన్నికల ముందే..చొరబాటుదారులను తరిమేస్తాం

  • Published By: venkaiahnaidu ,Published On : December 2, 2019 / 11:53 AM IST
2024 ఎన్నికల ముందే..చొరబాటుదారులను తరిమేస్తాం

దేశవ్యాప్తంగా NRCని అమలుచేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సృష్టం చేశారు. ఎన్‌ఆర్‌సి అమలుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు షా. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఇవాళ(నవంబర్-2,2019)అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అక్రమంగా దేశంలో ఉన్నవాళ్లందరినీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లోగా దేశం నుంచి పంపించేస్తామని అన్నారు. 

అంతే కాకుండా చొరబాటు దారులపై రాహుల్ గాంధీ ప్రేమ చూపిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. అమిత్ షా మాట్లాడుతూ…ఈ దేశం నుంచి జార్ఖండ్ నుంచి చొరబాటు దారులు అందరినీ పంపించేస్తాం. కానీ రాహుల్ బాబాకు ఇది ఇష్టం లేదు. వాళ్లు ఎక్కడికి వెళ్తారు? ఏం తింటారు? అని అడుగుతున్నారు. ఎందుకు సోదరా! మీ తోడబుట్టినవాళ్ళలా కనిపిస్తున్నారా ఏమిటి? ఒక్కొక్క అక్రమ వలసదారుని గుర్తించి, పంపించేసే పనిని బీజేపీ ప్రభుత్వం చేయబోతోందని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలలోపు  దేశంలోని చొరబాటు దారులందరినీ సరిహద్దు బయటకు పంపించేస్తామని  షా అన్నారు.

అంతకుముందు రాజ్యసభలో షా మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి అమలు చేస్తామని తెలిపారు. మతంతో సంబంధం లేకుండా భారత పౌరులందరూ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) జాబితాలో ఉంటారని, పౌరసత్వ సవరణ బిల్లుకు ఎన్‌ఆర్‌సి భిన్నంగా ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఎవరూ, మతంతో సంబంధం లేకుండా ఆందోళన చెందనవసరం లేదని, ప్రతి ఒక్కరినీ ఎన్‌ఆర్‌సి పరిధిలోకి తీసుకురావడం ఒక ప్రక్రియ మాత్రమేనని షా తెలిపారు. 

మరోవైపు దేశమంతా ఎన్‌ఆర్‌సి అమలుపై కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. దేశమంతా ఎన్ఆర్‌సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై ఆదివారం లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు తీసుకొచ్చారన్నారు. ఎక్కడో గుజరాత్‌కు చెందిన మోదీ, అమిత్ షా.. ఢిల్లీలో నివసిస్తున్నారు. వాళ్లూ కూడా వలసవాదులేనని చౌదరి అన్నారు.