ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతాం…తేజస్వీ

  • Published By: venkaiahnaidu ,Published On : November 1, 2020 / 05:51 PM IST
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతాం…తేజస్వీ

Will Increase Retirement Age Of Government Employees బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయం కోసం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ శ్రమిస్తున్నారు. నితీష్ సర్కార్ పై ఓ వైపు పదునైన పదజాలంతో విరుచుకుపడుతూనే…మరోవైపు రకరకాల హామీలతో ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆకర్షణీయమైన హామీ ఇచ్చారు.



ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలో వస్తే… ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని పెంచుతామని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 50ఏళ్లకు తగ్గించాలని సీఎం నితీష్ కుమార్ ఓ డిక్రీని జారీ చేశాడంటూ వస్తున్న వార్తలపై స్పందించిన తేజస్వీ…ప్రభుత్వ ఉద్యోగులకు 50ఏళ్లకే రిటైర్మెంట్ ఇస్తామంటున్న నితీష్..70ఏళ్లు ఉన్నా ఆయన ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారని..ఈసారి ఖచ్చితంగా ప్రజలు ఆయన చేత పదవీ విరమణ చేయిస్తారని తేజస్వీ అన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే..ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుని పెంచుతామని తేజస్వీ అన్నారు.



అంతేకాకుండా,ఉన్నతవిద్య విషయంలో బీహార్ వెనుకబడటంపై నితీష్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు తేజస్వీ యాదవ్. బీహార్ లో అండర్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి 3ఏళ్ల కన్నా ఎక్కువసమయం ఎందుకు పడుతుందని తేజస్వీ ప్రశ్నించారు. ఎందుకు 3ఏళ్లలోనే బీహార్ విద్యార్థులు అండర్ గ్రాడ్యేయేషన్ పూర్తి చేయలేకపోతున్నారు..అండర్ గ్రాడ్యేయేషన్ పూర్తి చేయడానికి వారికి 4-5ఏళ్లు పడుతుందనేదానిపై నితీష్ సమాధానం చెప్పి తీరాలన్నారు



కాగా, మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి 3దశల్లో ఎన్నికలు జరుగుతుండగా…అక్టోబర్-28,2020న తొలి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్-3న రెండో దశలో భాగంగా 94స్థానాలకు, మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.