Farooq Abdullah : మోదీతో భేటీకి సిద్ధం..గుప్కర్ కూటమి

జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలితప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తాము వెళుతున్నట్లు కశ్మీర్ ప్రాంతీయ పార్టీల కూటమి(పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్)మంగళవారం ప్రకటించింది.

Farooq Abdullah : మోదీతో భేటీకి సిద్ధం..గుప్కర్ కూటమి

Gupkar

Farooq Abdullah జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలితప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తాము వెళుతున్నట్లు కశ్మీర్ ప్రాంతీయ పార్టీల కూటమి(పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్)మంగళవారం ప్రకటించింది. ఇవాళ శ్రీనగర్ లోని తన నివాసంలో గుప్కర్ కూటమి నేతలతో సమావేశమైన అనంతరం కూటమి చైర్ పర్శన్ ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ…గురువారం ప్రధాని అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తనతో పాటు మెహబూబా ముఫ్తీ,మొహమ్మద్ తారిగమి సాహిబ్ హాజరవుతారని తెలిపారు. మోదీ అమిత్​ షాలను కలిసి తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తామని ప్రకటించారు. ఆర్టికల్​ 370 పునరుద్ధరణపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

ఇక,ఆర్టికల్ 370ని ఉదహరిస్తూ..తమ నుంచి తీసుకున్నదాని గురించి మాట్లాడేందుకే గుప్కర్ కూటమి కలిసికట్టుగా ముందుకొచ్చిందని పీడీపీ అధినేత్రి యొహబూబా ముఫ్తీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగవిరుద్ధం,అక్రమమని ముఫ్తీ ఫరూక్ నివాసంలో సమావేశం అనంతరం తెలిపారు.

ప్రధాని నుంచి తమకు ఇంతవరకు మీటింగ్ ఎజెండా గురించిన సమాచారం అందలేదని మరోవైపు,సీపీఐ(ఎం)నాయకుడు ఎమ్ వై తారిగమి తెలిపారు. తాము గుప్కర్ కూటమి అజెండాను ప్రస్తావిస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు ఇవ్వబడిన హామీలను పరిగణించాలని తాము ప్రధానికి విజ్ణప్తి చేస్తామన్నారు.

జమ్ముకశ్మీర్​కు సంబంధించిన పార్టీలతో సమావేశం ఏర్పాటుకు ప్రధాని మోదీ తీసుకున్న రాజకీయ చొరవను ది జమ్ము అండ్​ కశ్మీర్​ అప్నీపార్టీ(జేకేఏపీ) ప్రశంసించింది. దీని వల్ల జమ్ముకశ్మీర్​ ప్రజలకు నిజమైన సాధికారత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్​ ప్రజలకోసం మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలని జేకేఏపీ అధినేత అల్తాఫ్​ బుకారీ అన్నారు.

అయితే, జమ్ము కశ్మీర్‌ నాయకులతో ఈ నెల 24న ప్రధాని మోదీ భేటీ.. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)కు సంబంధించి మాత్రమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమే ప్రధాని సమావేశం నిర్వహించనున్నారన్నది ఊహాగానమేనని పేర్కొన్నాయి. రాష్ట్ర హోదా గురించి చర్చించే అవకాశమున్నప్పటికి దాని పునరుద్ధరణకు పార్లమెంటు అనుమతి అవసరమని తెలిపాయి.