మీ ఆస్తులు వేలం వేస్తాం…ఆందోళనకారులకు యూపీ సీఎం హెచ్చరిక

  • Published By: venkaiahnaidu ,Published On : December 19, 2019 / 04:13 PM IST
మీ ఆస్తులు వేలం వేస్తాం…ఆందోళనకారులకు యూపీ సీఎం హెచ్చరిక

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలకు పాల్పడేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆందోళనకారులపై రివేంజ్ తప్పదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం,కార్లు,బస్సులు తగులబెట్టం వంటి ఘటనలకు పాల్పడినవారి ఆస్తులను వేలం వేసి నష్టాన్ని భర్తీ చేస్తామని యోగి అన్నారు. సీసీటీవీ పుటేజీలో ఆందోళనకారుల ముఖాలు కనిపిస్తాయని,వారిపై బద్లా(ప్రతీకారం)తీర్చుకుంటామని యోగి తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని,పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామనే పేరుతో కాంగ్రెస్,ఎస్పీ,లెఫ్ట్ పార్టీలు దేశాన్ని తగులబెట్టాలని ఆందోళనకారులను ప్రోత్సహిస్తున్నారని యోగి అన్నారు.

గురువారం(డిసెంబర్-19,2019)లక్నో,సంబాల్,మౌ జిల్లా సహా ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఈ సమయంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. లక్నోలో అయితే ఇవాళ ఆందోళనకారులు కార్లకు,పోలీస్ ఔట్ పోస్ట్ కు,బైక్ లకు నిప్పుబెట్టారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు చేయగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మరోవైపు ఇవాళ మంగళూరులో కూడా పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు.