Karthika Deepam : కార్తీక పౌర్ణమికి ఉసిరికాయ దీపంతో నవగ్రహదోషాలు పోతాయా?…

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని... దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకుని.. నేతితో నింపాలి. ఆపై తామర కాడల వత్తులను వేసి దీపమెలిగించాలి.

10TV Telugu News

Karthika Deepam : కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. ఈ రోజు ఎవరైతే పరమశివుని వద్ద నేతి దీపములను వెలిగిస్తారో వారు తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్న వారికి సకల సంపదలు దరిచేరుతాయి.

కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రం, నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. శివఅష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభములు చేకూరుతాయి. పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, గుడికి వెళ్లి శివునిని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యం పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకుని.. నేతితో నింపాలి. ఆపై తామర కాడల వత్తులను వేసి దీపమెలిగించాలి. ఇలా చేస్తే.. మహిళలు దీర్ఘసుమంగళీ ప్రాప్తాన్ని చేజిక్కించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు. కార్తీకమాసంలో దీపదానం చేస్తే ఫుణ్యమని, సాలగ్రామ దానములు శుభదాయకము.

ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిదానం చేస్తే.. భూమండలానికి ప్రభువు అవుతారని, దారిద్ర్యం తొలగిపోతుందని విశ్వాసం. అలాగే ఇంటి ముందు తులసీ కోట వద్ద ఉసిరికాయతో దీపమెలిగిస్తే కోరిక కోర్కెలు నెరవేరుతాయట.