బెంగాల్ లోని ఆ 30 స్థానాల్లో 26 బీజేపీ ఖాతాలోనే..ప్రజలకు అన్నీ తెలియనివ్వం : అమిత్ షా

శనివారం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా..ఇందులో 26 సీట్ల‌లో గెలుపు బీజేపీదేన‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

బెంగాల్ లోని ఆ 30 స్థానాల్లో 26 బీజేపీ ఖాతాలోనే..ప్రజలకు అన్నీ తెలియనివ్వం : అమిత్ షా

Amit Shah

Amit Shah శనివారం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా..ఇందులో 26 సీట్ల‌లో గెలుపు బీజేపీదేన‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బూత్ స్థాయి కార్య‌క‌ర్త‌ల‌ు,నాయకులతో సంప్ర‌దించిన త‌ర్వాతే తాను ఈ విష‌యం చెబుతున్న‌ట్లు ఆదివారం ఢిల్లీలొ మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా చెప్పారు.

ఇక, శనివారం అసోంలో తొలి విడ‌త‌లో భాగంగా 47 సీట్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో 37కు పైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అమిత్ షా తెలిపారు. బీజేపీకి ఓటు వేసినందుకు రెండు రాష్ట్రాల ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అమిత్ షా అన్నారు. భారీ ఓటింగ్ శాతం నమోదవడం ప్రజలలో ఉత్సాహాన్ని చూపుతుందని అన్నారు. చాలా ఏళ్ల త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్‌లో ఎలాంటి హింస లేకుండా పోలింగ్ జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు. 200కుపైగా సీట్ల‌తో ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

బెంగాల్బీ జేపీ నేత ముకుల్ రాయ్ ఫోన్ కాల్‌ను ఎవ‌రు ట్యాప్ చేశారో తాను తెలుసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా అమిత్ షా చెప్పారు. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తాను ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల‌న‌ని ముకుల్ రాయ్ చెప్పిన‌ట్లు ఆ కాల్‌ లో స్ప‌ష్టంగా ఉంది. దీనిపై స్పందించిన అమిత్ షా.. అధికారుల బ‌దిలీకి సంబంధించిన డిమాండ్లు ఆ ఫోన్ కాల్‌లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ డిమాండ్ల‌ను లిఖిత‌పూర్వ‌కంగానే ఇచ్చామ‌ని, ఇందులో ర‌హ‌స్య‌మేమీ లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అస‌లు ప్ర‌శ్న ఇది కాద‌ని, అస‌లు ఫోన్ కాల్‌ను ఎవ‌రు ట్యాప్ చేశారో తెలియాల‌ని ఆయ‌న అన్నారు.

మరోవైపు, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ కూటమిలో భాగస్వామ్య పక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్.. శనివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తనను కలుసుకోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. అన్నీ బయటపెట్టలేమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం జ్యుడీషియరీ విచారణకు ఆదేశించడాన్ని సబబు కాదని అమిత్ షా అన్నారు.

కాగా, పశ్చిమ బెంగాల్ లో శనివారం ముగిసిన మొదటి దశ ఎన్నికల్లో మొత్తంగా 84.13శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. పూర్బా మెదీనిపూర్ జిల్లాలో అత్యధికంగా 86.32శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. తొలి దశ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలు ఎక్కువగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాలే. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయని.. 10 మందిని అరెస్టు చేసినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఇక,అసోంలో శనివారం ముగిసిన మొదటి దశ ఎన్నికల్లో 77శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.