విప్రో పెద్ద మనసు, కొవిడ్‌ ఆస్పత్రిగా పుణె విప్రో క్యాంపస్‌

10TV Telugu News

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం జరుగుతోంది. కరోనాపై పోరులో భాగంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో సాయం అందిస్తున్నారు. కొందరు విరాళాలు ఇచ్చారు. మరికొందరు ఎక్విప్ మెంట్ అందజేశారు. తాజాగా ఐటీ దిగ్గజం విప్రో నేను సైతం అంటూ అడుగు ముందుకేసింది. తన వంతు సాయం చేసింది. విప్రో తన క్యాంప్‌సను కొవిడ్‌-19 ఆస్పత్రిగా మార్చేందుకు సిద్ధమైంది. 

450 పడకలతో ఆసుపత్రి:
పుణె హింజేవాడిలోని ఐటీ క్యాంప్‌సను 450 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మే 30లోగా అన్ని సదుపాయాలతో ఆస్పత్రిని ప్రభుత్వానికి విప్రో అందజేయనుంది. ఐసోలేషన్‌ సదుపాయం ఉన్న ఈ ఆస్పత్రిలో కరోనా రోగులకు అత్యవసర చికిత్స కోసం 12 పడకలను ఏర్పాటు చేస్తారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది కోసం 24 ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు.

మౌలిక సదుపాయాల కల్పన:
ఆసుపత్రిగా మార్చడమే కాదు అవసరమైన మౌలిక సదుపాయాలు, మెడికల్ ఫర్నిచర్, సామగ్రిని అందిస్తామని విప్రో తెలిపింది. అవసరమైన వైద్య నిపుణులతో ఆసుపత్రిని త్వరగా నడిపించడంలో సహాయపడటానికి నిర్వాహకుడిని, సహాయక సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా, 
ఏడాది తర్వాత మళ్లీ ఈ ఆస్పత్రి ఐటీ భనవంగా మారనుంది. 

కరోనాపై యుద్ధంలో భాగస్వామ్యం:
కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, మానవాళిని కాపాడుకోవడానికి మనమందరం కలిసి పనిచేయాలని నమ్ముతున్నాము. COVID-19 కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో మేము అండగా నిలబడతాం” అని విప్రో లిమిటెడ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు.

×